Minister Komatireddy Fires On BJP : మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని కేసీఆర్ లాంటి నియంతనే పక్కన కూర్చోబెట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దొంగ రాజీనామా లేఖలతో హరీశ్‌రావు మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. నల్గొండలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జానారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తాం : ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని లేనిపక్షంలో దేనికైనా సిద్ధమేనని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని రాహుల్ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని దుయ్యబట్టారు.
Congress leader Janareddy On Guarantees : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్‌ను అడుగున తొక్కేశాయని మంత్రి విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలుకు అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
"కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి చెప్పినట్లు నేను కూడా దేనికైనా సిద్ధమే. హరీశ్ రావు దొంగ రాజీనామా లెటర్లు రాసుకొచ్చారు. రాజీనామా ఎట్లా రాయాలో తెలియకపోతే నన్ను అడగాలి. పోలీసులు, మోదీకి బయపడేది లేదు. నోటీసులతో మా పార్టీని బయపెట్టలేరు" - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి
తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నల్గొండను దశదిశామారుస్తానని నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్ రెడ్డి తెలిపారు. పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలను కోరారు.