Minister Komati reddy Fires On BJP BRS : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేశామని, రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటని రోడ్లు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై పలు విమర్శలు గుప్పించారు.
Minister Komati reddy Fires On KCR KTR : తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల సర్కార్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు పదే పదే ఏడాదిలో ప్రభుత్వం కూలుతుందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించుతారని ఆయన ప్రశ్నించారు. రానున్న 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ పోటీ నామమాత్రమే : భువనగిరి అంటేనే పోరాటాల గడ్డ అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌కు ఇక్కడ తిరుగులేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ల పోటీ నామమాత్రంగానే ఉంటుందని ఆయన తెలిపారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు లక్షల మెజారిటీ రాబోతోందన్నారు. భువనగిరి, నల్గొండ స్థానాలకు మధ్య పోటీ అని వివరించారు.
వర్షాలు లేక కరవు వచ్చినా ఆదుకుంటున్నామన్న మంత్రి, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను పదేళ్లలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనను కలవాలంటే మంత్రులకు సాధ్యం అయ్యేది కాదన్నారు. తాము ఎప్పుడు వెళ్లినా సీఎం రేవంత్‌ను కలిసే అవకాశం ఉందన్నారు.
ఆట ఇప్పుడే మొదలైంది : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరిలో ఇప్పుడే ఆట మొదలైందని, తెలంగాణలో రాజకీయాలు అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తామన్నారు. జిల్లాలో 11 సీట్లు సాధించామన్న రాజగోపాల్ రెడ్డి, చిన్న తప్పిదం వల్ల సూర్యాపేట స్థానంలో ఓడిపోయామని చెప్పారు. జగదీశ్ రెడ్డి అక్రమాలను బయటకు తీస్తామన్నారు. వచ్చే ఏడాది కవిత ఎక్కడ బతుకమ్మ ఆడుతుందని ఎద్దేవా చేశారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు రోజులకే కేసీఆర్ కుమారుడు సర్కారు పడిపోతుందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కానీ అనుభవం లేని కేటీఆర్ మాటలను పక్కనపెట్టాం అయితే పదేళ్ల ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ సైతం ఏడాదిలో ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌కు కాపలాగా ఉన్నది హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి" - కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మంత్రి