Minister Jupally Fires on Niranjan Reddy : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై సీఎల్పీ నేతలు విరుచుకుపడ్డారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ పార్టీలను విలీనం చేసినప్పుడు రాజ్యాంగం కనిపించలేదా అని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు, నిరంజన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని జూపల్లి పేర్కొన్నారు. లేఖలు రాయాల్సింది రాహుల్ గాంధీకి కాదని, మీ వల్లే ఓడిపోయామని కేసీఆర్‌కు రాయాలని సూచించారు. అవినీతి సంపాదనతో నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది మీరు కాదా అని మంత్రి ప్రశ్నించారు.
రాహుల్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు : నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమించారని, ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రధాన మంత్రి పదవి కాళ్లదగ్గరకు వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వదులుకున్నారని గుర్తుచేసిన ఆయన, రాహుల్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.
"బీఆర్ఎస్ నేత నిరంజన్‌రెడ్డి రాహుల్ గాంధీకి లేఖ రాయడం అభ్యంతరకరం. ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి ప్రతి అంశంలో మద్దతు ఇస్తూ వచ్చిందో అప్పడు లేఖ రాయాలి. కానీ నాడు నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు , భారత రాష్ట్రపతి ఎన్నిక ఇలా ఎన్నో అంశాల్లో బీజేపీ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినప్పుడు మద్దతు ఇచ్చి, కనీసం ఎమ్మెల్సీ నిబంధనలు కోసం కూడా ప్రశ్నించని మీకు , రాహుల్ గాంధీని విమర్శించే హక్కు కనీసం ఉందా?"- జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మంత్రి
Minister Jupally Comments on BRS Party : గులాబీ, కమలం పార్టీలు కుమ్మక్కై అంబేడ్కర్ ఆయాశయాలను కాలరాస్తుందన్న ఆయన, కేసీఆర్‌కు, బీజేపీకి లేఖ రాయాల్సిందిగా మాజీ మంత్రికి సూచించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన సాగుతుందని హస్తంలోకి ఇతర పార్టీల నాయకులు వస్తున్నారని వివరించారు. నాడు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బలవంతంగా బీఆర్ఎస్లో చేర్చుకున్నారని గుర్తుచేశారు.
అటువంటి మీరు విలువల గురించి మాట్లాడటం విడ్డూరమని, ప్రశ్నించే నైతిక అర్హత కూడా లేదని జూపల్లి వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డ మంత్రి , కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలల్లోనే కూలిపోతుందని శాపనార్ధాలు పెట్టారని ధ్వజమెత్తారు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ కూల్చాలని చూస్తుంది మీరు కాదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసమే తమ ప్రయత్నమని మంత్రి చెప్పుకొచ్చారు.