Damodara Rajanarsimha Chit Chat on Cabinet Expansion : త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి, ఐదారుగురికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కనుందన్నారు. శాఖల మార్పులకు సైతం అవకాశం ఉందన్న ఆయన, కీలకమైన హోం మంత్రి పదవి ప్రస్తుతం మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్కకు ఇచ్చే అవకాశం ఉందన్నారు.
మంత్రివర్గంలో కుల సమీకరణాల ఆధారంగా ఓ ముదిరాజ్‌కు, రెడ్డికి సైతం స్థానం ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందన్న దామోదర, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్‌కు చోటు కల్పించే ఆస్కారం ఉందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మరొకరికి చోటు దక్కనున్నట్టు పేర్కొన్నారు. పార్టీలు మారిన వారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వొద్దనుకున్నప్పటికీ, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బయట నుంచి వచ్చిన వారికి సైతం మంత్రి వర్గంలో చోటు దక్కనుందని స్పష్టం చేశారు.
ఈ నెల 7లోపు మంత్రివర్గ విస్తరణ! : ఇటీవల 5 రోజుల పాటు దిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు మధ్యాహ్నం గవర్నర్‌తో సీఎం భేటీలోనూ కేబినెట్ విస్తరణపైనే చర్చించినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ నెల 7 తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో అంతకు ముందే ప్రమాణ స్వీకారం చేయాలన్న భావనతో పార్టీ వర్గాలు ఉన్నాయి. రేవంత్ దిల్లీ పర్యటనలో ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించి ఉంటే గవర్నర్ వద్ద సీఎం ఇదే అంశం చర్చించి ఉండొచ్చని తెలుస్తోంది.