Pinnelli Destroy EVM : మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీధి రౌడీలా వ్యవహరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే, మాచర్ల వైఎస్సార్సీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం 202లోని బూత్‌లోకి అనుచరులతో కలిసి వెళ్లారు. అలా వెళ్లటం నిబంధనలకు విరుద్ధం అయినా పోలీసులు ఎక్కడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బూత్‌లోని ఈవీఎంను బయటకు నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సిట్ విచారణతో ఈ వ్యవహారం బహిర్గతం కాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాలుగుసార్లు ఎమ్మెల్యే, సహాయమంత్రి హోదా కలిగిన విప్ పదవిలో ఉన్న పిన్నెల్లి ఇలా వీధిరౌడీలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అల్లర్లు, దాడులకు పెట్టిన పేరైన మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల విధ్వంసాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్, బ్యాలట్ల ధ్వంసం వంటివి అధికార పార్టీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇదే విషయాన్ని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సైతం గుర్తుచేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఎన్నికల విధులు అంటే కత్తిమీద సామేనని చాలామంది ఉద్యోగులు అక్కడకు వెళ్లటానికి ఇష్టపడరు. అక్కడ వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు ఉండదు. అది గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనే స్పష్టమైనా, యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తారని, అనేక విధాలుగా ప్రభావితం చేస్తారని వారి వ్యవహారాలు తెలిసిన పోలీసు అధికారి చెప్పారు.
ఎన్నికల బదిలీల్లో భాగంగా మాచర్ల జిల్లాలో పనిచేసిన పోలీసుల్ని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పంపించగా.. ఆయా జిల్లాల సిబ్బందికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. మాచర్ల రూరల్, అర్బన్, కారంపూడి సీఐ, ఎస్ఐ పోస్టులకు ఎవరూ పోటీ పడలేదు. కొన్నిరోజుల పాటు ఖాళీగా ఉండడంతో చివరకు ఉన్నతాధికారులే భరోసా ఇచ్చి బలవంతంగా పంపారు. అక్కడ ఎమ్మెల్యే సోదరుల అరాచకాలే అందుకు కారణం. పోలింగ్ వేళ ఎమ్మెల్యే అనుచరులు నేరాలు, ఘోరాలకు పాల్పడుతుంటారు. ఆ సమయంలో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లడమో, గృహ నిర్బంధం విధించడమో జరుగుతుంది. కాగా, ఆ పనిచేస్తే తమను భవిష్యత్తులో గుర్తు పెట్టుకుంటారన్న భయాందోళనలు చాలామంది అక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడానికి కారణమనేది వాస్తవం. సాధారణ రోజుల్లో అక్కడ పోస్టింగ్ కోసం పోటీపడుతుంటారు. ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం క్యూ కట్టేవారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం భారీగా తరలించి విక్రయించే మాఫియా పోలీసులకు అంతే మొత్తంలో బహుమతులు అందిస్తుంది. అదే విధంగా తెలంగాణలోకి వెళ్లే గ్రానైట్ లారీల నుంచి వచ్చే ఆదాయం కూడా అంతా ఇంతాకాదు. అందుకే పోలీస్ అధికారులు ఏరి కోరి ఇక్కడికి రావాలని పైరవీలు చేయించుకుంటారు. ఇక ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతల అరాచకాలు తెలుసుకుని ఎవరూ పోస్టింగ్‌లకు పైరవీలు చేసుకోలేదు.
అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్- అరెస్ట్ భయంతోనేనా? - MLA Missing
ఈవీఎం ధ్వంసం ఘటనపై అటు పోలీసులు గానీ, ఇటు పోలింగ్ సిబ్బంది గానీ ఏ మాత్రం స్పందించలేదు. విధ్వంసానికి పాల్పడిన ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు. అనుచరులతో కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లడమే నేరం అయినా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈవీఎం విధ్వంసంపై అక్కడున్న పీవో అరెస్టుకు ఆదేశించాల్సి ఉన్నా ఎవరికివారు భయపడి మిన్నకుండిపోయారు. ఆ ఘటనలను పీవో డైరీలో నమోదు చేశారా లేదా? సూక్ష్మ పరిశీలకులు సైతం జిల్లా ఎన్నికల పరిశీలకుని దృష్టికి తీసుకెళ్లారా లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సిట్ దర్యాప్తు చేసే వరకు ఘటన వెలుగులోకి రాలేదంటే అధికారులు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu