Nara Lokesh Fire On CM Jagan Policy : తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జీవో రద్దు చేసి విద్యను మళ్లీ ప్రతీ గడపకు తీసుకెళ్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగులలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్ - అవినీతి ఫుల్ అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంసం - రోజుకో భూకబ్జా, కిడ్నాప్ : నారా లోకేశ్
మాడుగుల నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడు (Mutyala Naidu) అక్రమాలకు పాల్పడుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. క్వారీ, మైనింగ్ యజమానుల నుంచి దాదాపు నెలకు కోటి రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిన 17 పథకాలను తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఫ్యాన్‌ను చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చింది: నారా లోకేశ్
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలాట ఆడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్న లోకేశ్, పరిశ్రమలు తేవడం కాదు కదా ఉన్నవి కూడా పారిపోయేలా చేశారని మండిపడ్డారు. ఫలితంగా ఐదేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు అని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు. విశాఖకు పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలు (IT industries) తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది: లోకేశ్
పాలిచ్చే ఆవు తెలుగుదేశమైతే, తన్నే దున్నపోతు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని లోకేశ్ ఎద్దేవా చేశారు. పాలిచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని, ముత్యాలనాయుడిని గెలిపిస్తే ఉత్తరాంధ్రకు ఏం చేశారు ? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్కచోటైనా రోడ్డు వేశారా, ఒక్క గుంత అయినా పూడ్చారా ? అని నిలదీశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి నిల్ - అవినీతి ఫుల్ అని లోకేశ్ ఆరోపించారు. ఇష్టమొచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ - జనసేన (tdp-janasena) కూటమిని గెలిపించాలని కోరుతూ అభివృద్ధి ఏంటో చూపిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన గిరిజనుల 17 సంక్షేమ కార్యక్రమాలను రెండు నెలలు ఓపిక పడితే మళ్లీ తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, ప్రమాదంలో కార్యకర్త చనిపోతే కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. కార్యకర్తల కోసం ఇప్పటికే దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని లోకేశ్ వెల్లడించారు.