Lokesh Arrangements for PM Modi Sabha: ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనే చిలకలూరిపేట బహిరంగ సభ ఏర్పాట్లను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమైన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే తొలి సభకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయాలని 3 పార్టీలు నిర్ణయించాయి.
అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు- మూడు పార్టీల నేతల కీలక భేటీ
తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి సభను నిర్వహించాలనే చంద్రబాబు ఆలోచనను కార్యాచరణలో పెట్టేందుకు యువగళం సారధి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో శంఖారావం కార్యక్రమం ముగించుకుని నారా లోకేశ్ నేరుగా అమరావతి చేరుకుంటారు. ఈ నెల 17న జరగబోయే సభా ఏర్పాట్లను లోకేశ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ముఖ్య నేతలతో సభా నిర్వహణ గురించి చర్చించనున్నారు.
సిద్ధం సభల కోసం వైసీపీ వందల కోట్ల వ్యయం- అధికార దుర్వినియోగంపై విమర్శల వెల్లువ
రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకూ జరగని విధంగా భారీ ఎత్తున సభ నిర్వహించాలని భావిస్తున్నందున లోకేశ్‌కు తెలుగుదేశం అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఒంగోలు మహానాడు, నవశకం వంటి భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో లోకేశ్ కీలక పాత్ర వహించారు. రాష్ట్ర ప్రయోజనాలు - ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు అనే ప్రధాన అంశాన్ని చిలకలూరిపేట సభావేదిక ద్వారా వివరించనున్నారు. ఈ సభ ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి - ప్రజా సంక్షేమానికి నాంది పలకుతుందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి.
బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు
టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ పాల్గొనే సభకు ఒక రోజు అటు ఇటు అయినా అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని బాబు సూచించారు. ఈ మేరకు 17న జరిగే బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లు నేతలతో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
సీట్ల సర్దుబాటుపై చర్చలు : ఐదు సంవత్సరాలల్లో సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు తెలిపారు. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి కేంద్రంతో కలిసి ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామని, పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దని అన్నారు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయని, స్పష్టత వచ్చిందని అన్నారు. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుందని, తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.