Lok Sabha Election Nominations In Telangana : రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం తుదిదశకు చేరుకుంది. గురువారం ఒక్కరోజే గడువు ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని రోడ్‌షో నిర్వహించారు. బీఆర్ఎస్ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి అట్టహాసంగా రోడ్‌షో నిర్వహించారు.
BRS MP Candidate Election Nomination : హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్ భారీ ర్యాలీ నడుమ అట్టహాసంగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. హైదరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మాధవీలత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేశారు. ప్రజల మనసును ఎప్పుడో గెలుచుకున్నానని విజయం తథ్యమని మాధవీలత విశ్వాసం వ్యక్తం చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి : నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి నామపత్రాలు సమర్పించారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలకు ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్‌రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తకుమార్‌రెడ్డిలతో కలిసి నామినేషన్ వేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి నల్గొండలో ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. గత పాలకులెవరూ చేయని విధంగా తాను అభివృద్ధిని చేసి చూపిస్తానని రఘవీర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
BRS Candidate Nama Nageswara rao Nomination : ఖమ్మం లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, పార్థసారథిరెడ్డిలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరడం తప్ప వేరే పనేమి లేదని మంత్రి దామోదర్ రాజనర్సింహ విమర్శించారు. జహీరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్‌షెట్కార్ నామినేషన్ పత్రాల దాఖలులో షబ్బీర్‌అలీతో కలిసి పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి రెండోసెట్ నామినేషన్ వేశారు. మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
BJP MP Candidate Nomination : ఆదిలాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ కార్యక్రమం అట్టాహాసంగా జరిగింది. పెద్దపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా అరూరి రమేష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య రెండో సెట్ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరిలతో కలిసి మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు అంతర్గతంగా ఒప్పందం చేసుకుని బహిర్గతంగా తిట్టుకుంటున్నాయని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ప్రముఖ సినీనటి దాసరి సాహితీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇదే స్థానం నుంచి పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామపత్రాలు దాఖలు చేశారు.