MP Election Nomination in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 144 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పదిహేడు లోక్‌సభ స్థానాలకు శనివారం నాటికి 156 మంది నామినేషన్లు వేశారు. నిన్న సెలవు తర్వాత ఇవాళ 144 మంది 169 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇవాళ మరో సెట్ దాఖలు చేశారు. నేడు ఆదిలాబాద్‌లో మూడు, పెద్దపల్లిలో 14, కరీంనగర్లో 13, నిజామాబాద్‌లో 12, జహీరాబాద్, మెదక్, ఖమ్మంలో ఏడు.
మల్కాజిగిరి, నల్గొండ, వరంగల్‌లో పది, సికింద్రాబాద్‌లో 9, హైదరాబాద్, నాగర్ కర్నూలులో ఆరు, చేవెళ్లలో 11, మహబూబ్‌నగర్‌లో నాలుగు, భువనగిరిలో 11, మహబూబాబాద్‌లో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు శ్రీగణేష్, లాస్య నందిత సహా 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్లతో ఎన్నికల సందడి : వచ్చే నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ హడావిడి నెలకొంది. ఓ వైపు అభ్యర్థుల ప్రచారాలు, మరోవైపు నేతల పర్యటనలు, ఇంకోవైపు నామినేషన్లతో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 18న రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా మంచిరోజులు చూసుకుని అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతూ కార్నర్ మీటింగ్‌లు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు.
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. తూంకుంట పురపాలక పరిధిలోని మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామపత్రాలు దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్, ముఖ్య ఎన్నికల అధికారి గౌతమ్‌కు పార్టీ నేతలతో కలిసి ఆమె నామినేషన్ పత్రాలు అందజేశారు. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్‌రావు నామినేషన్ వేశారు. మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు.
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శాసన సభ్యులు, నేతలు వెంటరాగా కావ్య తన నామపత్రాలను జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు అందచేశారు. వరంగల్ బరిలో ఓ మహిళకు పోటీ చేసే అవకాశం తనకు కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిందని, తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.
BJP MP Candidate Election Nomination : బీజేపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు సైతం జోరుగా సాగాయి. చేవెళ్ల బీజీపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్వో అధికారికి విశ్వేశ్వర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు చేవెళ్ల నుంచి తన సతీమణి సంగీతారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి, భారీ ర్యాలీ నిర్వహించారు.
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ రుద్రారం గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ వేశారు. పాటిల్ నామినేషన్ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. రాష్ట్రంలో హైదరాబాద్ సహా అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.
MP Nominations in Telangana : మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రొఫెసర్ సీతారాంనాయక్ నామినేషన్ దాఖలు చేశారు. సీతారాంనాయక్ నామినేషన్ సందర్భంగా పట్ఠణంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. రోడ్‌షోలో బోనాలు, పోతురాజుల విన్యాసాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. 70 ఏళ్లుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకు మోదీ సర్కార్ పరిష్కారం చూపిందన్న కేంద్ర మంత్రి, సీతారాంనాయక్‌ను గెలిపించాలని కోరారు.
వరంగల్ పార్లమెంటు స్ధానానికి బీఆర్ఎస్ అభ్యర్ధిగా సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ సారయ్య, ఇతర నేతలు వెంట రాగా నామపత్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు అందజేశారు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్ నామినేషన్ వేశారు. ఉదయం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామీకి ప్రత్యేక పూజలు నిర్వహించిన క్యామ, పార్టీ నేతలతో కలిసి భువనగిరి కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు.