AP Land Titling Act : జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములపై యాజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందంటూ వాపోతున్నారు. వ్యవసాయ భూములే గాకుండా మున్ముందు ఇళ్లు, ప్లాట్లు, ఖాళీ స్థలాల భద్రతపైనా బెంగపెట్టుకున్నారు.
అక్కడ కేసీఆర్ ఓటమికి అదే కారణం- ఇక్కడ ఆందోళనలో జగన్ అండ్ కో! - Land Titling Act
"జగన్ భూ దాహానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఆయుధం కానున్నది. లక్షల కోట్ల బ్లాక్ మనీ అంతా తిరిగి భూముల రూపంలోకి మళ్లించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, వివాదాస్పద లక్షల ఎకరాలు అజ్ఞాత వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించే ప్రమాదం పొంచి ఉంది. గతంలో పరిశ్రమల పేరిట సేకరించిన భూములు, మున్ముందు పరిశ్రమల పేరిట చేపట్టే భూ సేకరణకు ఇప్పటికే రంగం సిద్ధం అవుతోంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఇందుకు అవకాశం కల్పిస్తోంది" అని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుబులు పుట్టిస్తోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - ఆస్తుల సంగతేంటి? - AP Land Titling Act 2023
దేశంలో ఎక్కడా లేని చట్టం అది. కేంద్రమే తెచ్చిందని ఇక్కడి మంత్రులు చెప్తున్నా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అది అమలులో లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు తొందరపడ్డట్టు? ఎవరి ప్రయోజనాలు ఆశించి చట్టం ముసుగులో ముందుకొస్తున్నట్లు? అని ప్రశ్నిస్తే సామాన్యుడు, రైతులు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"భూ వివాదాల పరిష్కారం పేరుతో చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్తున్నా ఈ చట్టం అనేక వివాదాలకు ఆజ్యం పోసే ప్రమాదం ఉంది. ఉపాధి కోసం ఊరు వదిలి వెళ్లిన వాళ్లు, విదేశాల్లో ఉంటున్న వారు భూములపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితిని కొత్త చట్టం కల్పిస్తోంది. రాజకీయ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న వారికి సైతం ఈ చట్టం అస్త్రంలా ఉపయోగపడనుంది. భూమి మాది అని చెప్పుకోవడమే తప్ప.. రుజువు చేసుకునేందుకు ఎలాంటి మార్గం కనిపించదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగే ఈ వ్యవహారం అంత తేలిక కాదు. చట్టంలో కీలక పాత్ర పోషించే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) నియామకం మొత్తం రాజకీయంగా ముడిపడి ఉండడమే ఇందుకు కారణం" అని విపక్ష నేతలు పేర్కొంటున్నారు.
మన భూమి పక్కనే వైఎస్సార్సీపీ నేత భూమి కూడా ఉంటే గతంలో సరిహద్దు వివాదాలు కూడా ఉంటే ఇక ఆ భూమిని మర్చిపోవాల్సిందేనా? అనే సందేహం కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తులు మన భూమిపై ఫిర్యాదు చేసినా, చివరికి ఎవరూ ఫిర్యాదు చేయకున్నా అధికార పార్టీ నియమించే ల్యాండ్ టైట్లింగ్ అధికారి సుమోటోగా తీసుకుని మన భూమి రిజిస్ట్రేషన్ నిలిపేసే ప్రమాదం లేకపోలేదు. భూమి నాదే అని నిరూపించుకునేందుకు అవసరమైన అని పత్రాలున్నా చివరికి దానిని సైతం పెండింగ్‌లో పెట్టే వీలు టీఆర్‌ఓకు కల్పిస్తోందీ చట్టం. చిన్న, సన్న కారు రైతులు ప్రత్యర్థులతో వేగలేక, హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక చివరికి రాజీ పడాల్సిందే. ఇచ్చిందే బహుమానం అంటూ భూమి అప్పగించాల్సిందే అని ఆందోళనకు గురవుతున్నారు.