Lok Sabha Poll Results in Joint Nalgonda District 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతగా జరుగుతోంది. ఇందులో భాగంగానే నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కౌంటింగ్ పూర్తయింది. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి 5,59,906 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ 7,84,337 ఓట్లు బీజేపీకి 2,24,431, బీఆర్ఎస్కి 2,18,417 ఓట్లు వచ్చాయి. మరోవైపు భువనగిరి లోక్‌సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 1.95 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.తమ పార్టీ నేతలు విజయం సాధించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
Nalgonda Lok Sabha Election Results 2024 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, బీఆర్ఎస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. అదే జోష్‌ను పార్లమెంట్ ఫలితాల్లో రిపీట్ చేయాలని హస్తం పార్టీ వ్యూహాలు రచించింది. ఈ జిల్లా నుంచే ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ పార్టీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే నల్గొండ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డిని రంగంలోకి దింపింది. దీనికితోడూ కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు.
Bhuvanagiri Lok Sabha Election Results 2024 : మరోవైపు శాసనసభ ఎన్నికల ఓటమితో కొంత నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెట్టారు. కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారంలోకి దిగి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందనే ధీమాతో గులాబీ పార్టీ రంగంలోకి దిగింది. కానీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేదు.
తెలంగాణలో రెండంకెల స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే నల్గొండ, భువనగిరి స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తీవ్రంగా శ్రమించింది. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి సైదిరెడ్డి పోటీ చేయగా, భువనగిరి తరఫున బూర నర్సయ్యగౌడ్ రంగంలోకి దిగారు. మోదీ చరిష్మాతో తాము విజయం సాధిస్తామనే ధీమాతో ప్రచారం నిర్వహించారు. ఇందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్, కమలం పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినా చివరికి హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
"రఘువీర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఓటర్ల మహాశయులకు ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలసికట్టుగా పనిచేసి గెలిపించారు. దేశంలోనే నల్గొండ ఖ్యాతిని మరోసారి చాటిచెప్పారు. నల్గొండ జిల్లాకి ఇది గర్వకారణం. మెజార్టీలో దేశంలోనే టాప్ 10లో రఘువీర్ రెడ్డి ఒకరికిగా గెలిచారు. 5.5 లక్షల మెజారిటీ వస్తోందని పోలింగ్ జరిగిన మరుసటి రోజే చెప్పాను. కాంగ్రెస్‌తో కలిసి వచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు." -జానారెడ్డి, మాజీ సీఎల్పీ నేత
Minister Komatireddy In Nalgonda Results : కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ని అత్యధిక మెజారిటీ గెలిపించిన ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భువనగిరిలో 2లక్షల మెజార్టీతో చామల గెలిచాడని హర్షం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతుమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు. దేశంలో ఇప్పుడు వస్తున్న ఫలితాల ప్రకారం ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.