KTR Comments On Party Defections : తెలంగాణలో త్వరలో ఉపఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు అనర్హత విషయమై న్యాయకోవిదులతో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందన్నారు.
సుప్రీం కోర్టులో త్వరలోనే బీఆర్ఎస్ తరఫున కేసు వేస్తామని కేటీఆర్ తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు దిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. రాజ్యాంగ నిపుణులతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది.
పార్టీ ఫిరాయింపులు నివారించేందుకు బీఆర్‌ఎస్ అనర్హతా పిటిషన్ మంత్రం - Lok Sabha Election 2024
న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ నేతల సంప్రదింపులు : ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతా వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం : హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు.
'ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ - అంకురార్పణ చేసిందే కాంగ్రెస్' - PARTY DEFECTIONS IN TELANGANA