KTR Reacts On Tummala Statement on Rythu Bharosa : ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేల గొప్పలు చెప్పిన సీఎం, ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారని మండిపడ్డారు.
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టారని, రుణమాఫీ విషయంలోనూ ఇలాగే మోసం చేశారని వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మల దిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయన్న కేటీఆర్ వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని, ఇప్పుడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారన్నారు.
ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా
— KTR (@KTRBRS) September 20, 2024
అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు
తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… pic.twitter.com/8IW6Qpp29g
నమ్మించి మోసం చేస్తే ఊరుకోరు : తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ, నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరన్న కేటీఆర్, గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
— KTR (@KTRBRS) September 20, 2024
తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు
ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను అమలు చెయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చుసిన కేసీఆర్ సర్కార్-వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడ్తున్న… pic.twitter.com/Y9D6aba1O9
మరోవైపు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. క్యాష్ లెస్ ట్రీట్మెంట్పై వచ్చిన వార్తలను ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్ ప్రజా పాలనలో ఉద్యోగులకు తిప్పలు తప్పటం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులను సొంత కుటుంబంలా చూశారని, ఇప్పుడు కాంగ్రెస్ వైద్యానికి కూడా డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ తెచ్చిన జోవోను అమలు చేయాలి : ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ అమలు చేయటం లేదన్న కేటీఆర్ ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మొండి వైఖరితో 20 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్న ఆయన తక్షణం బీఆర్ఎస్ తెచ్చిన జీవోను సర్కారు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
'కింది స్థాయి పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారు' - Jagadish Reddy on CM Revanth