KTR about Jobs in Telangana : ఉద్యోగాల కల్పనపై తాము సరిగా ప్రచారం చేసుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గత 65 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన వైద్య కళాశాలలు 3 మాత్రమేనని, తాము పదేళ్లలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశామని, వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లామని చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో ఎమ్మెల్సీ ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని, అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి 6 నెలల్లోనే ప్రజలకు అర్థమైందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, గత పదేళ్లలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని ఉద్ఘాటించారు. సామాజిక మాధ్యమాల్లో తమపై బాగా దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశామని తెలిపారు.
పచ్చి అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలే పట్టించుకోకపోతే కాంగ్రెస్ హామీలు ఎప్పుడు ఇచ్చిందనే స్థితికి చేరుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన కేసీఆర్కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
'ముఖ్యమంత్రి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి మరోసారి కూడా మోసం చేయాలనుకుంటున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేశామని అంటున్నారు. మరీ ఇల్లందులో ఏమైనా ప్రత్యేకంగా చేశారో నాకు తెలియదు. కానీ ఆరు గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు ఒక్కటే అమలైంది. ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొట్లాడుకుంటున్నారు. మగవాళ్లు అయితే టికెట్ తీసుకుని తిట్టుకుంటున్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నా ప్రభుత్వానికి, సీఎంకు మీరే కర్రు కాల్చి వాత పెట్టాలి'- కేటీఆర్, మాజీ మంత్రి