KTR MLC Election Campaign at Haliya in Nalgonda : వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు.
KTR Fires on Congress Government : గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని మరోసారి గుర్తు చేసుకోవాలని పట్టుభద్రులకు తెలియజేశారు. తమ ప్రభుత్వం పని చేసి కూడా చెప్పుకోలేకపోయిందని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.80 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని వివరించారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది : కేటీఆర్ - MLC Election KTR Campaign
KTR on BRS 10 Years Development : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కృష్ణా నదిపై కేంద్ర అజమాయిషీకి మాజీ సీఎం కేసీఆర్ ఎన్నడూ ఒప్పుకోలేదని హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున సాగర్‌ను కేంద్రం చేతిలో పెట్టిందని విమర్శించారు. సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తే ఒక్కరూ మాట్లాడలేదని అన్నారు. రైతులకు ఇస్తానన్న రుణమాఫీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"గత పదేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. మేము పని చేసి చెప్పుకోలేకపోయాం. అదే మా ఓటమికి కారణం. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించలేకపోయాం. స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు కేటాయించే మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే."- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు