Lok Sabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి, పథకాల అమలులో పూర్తిగా విఫలమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినా, సీఎంగా మాత్రం కేసీఆర్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 12 ఎంపీ సీట్లు ఇస్తే, గుంపుమేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కల్వకుర్తిలో ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా బస్సుయాత్ర చేపట్టారు.
కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది : కేటీఆర్ - KTR Comments on Congress Party
ఈసందర్భంగా మాట్లడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను పాలమూరు బిడ్డ, నల్లమల్ల బిడ్డనంటూ ప్రజలను నమ్మించి, ఇవాళ పథకాల అమలులో అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండానే, అమలు చేసినట్లు ప్రజలను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
నమో అంటే, నమ్మించి మోసం చేయడమేనని మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. పేదలందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి మోదీ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కృష్ణా జలాల్లో పదేళ్లుగా తెలంగాణ వాటాను కూడా మోదీ తేల్చలేదని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏం అడిగినా, అయోధ్యలో గుడి కట్టామని మోదీ చెప్తున్నారని, కేసీఆర్ అద్భుతంగా యాదాద్రి ఆలయం నిర్మించలేదా? అని పేర్కొన్నారు. యాదాద్రి ఆలయాన్ని తాము ఎప్పుడైనా రాజకీయంగా వాడుకున్నామా? అని ప్రశ్నించారు.
బీజేపీ మళ్లీ గెలిస్తే, పెట్రోల్ రేటు రూ.400 దాటడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదని దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే, దేశంలో మోదీ సుంకాలు పెంచారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్లే నిత్యావసరాల ధరలు మాత్రం పెరిగాయన్నారు. మోదీ, అదానీ వంటి కంపెనీలకు మాత్రం రూ.40 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారని దుయ్యబట్టారు.
"బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయినా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని ప్రజలు భావించారు. కానీ కాలేదు. అది నిజమయ్యేందుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను 12 సీట్లలో గెలిపించండి. గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం". - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెెంట్
బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం : కేటీఆర్ - KTR Visit manne krishank