KTR Comments on Congress over Water Shortage : నీళ్లు ఉండి కూడా పంటలు ఎండిపోవాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి లేదని, సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని, కానీ ఇవాళ నగరంలో ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందని విమర్శించారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోనూ నీళ్లు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత : చుట్టూ నీళ్లు ఉండగా హైదరాబాద్ వాసులు నీళ్లు ఎందుకు కొంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తండని సూచించారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)పై కాదని వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. గతేడాది వర్షాలు బాగా కురిశాయని ఐఎండీ చెప్పిందన్న ఆయన, తాగునీటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అని ఎద్దేవా చేశారు. ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయని, మరో రెండు నెలలు ఎండలు ఉంటాయని వివరించారు. మిషన్ భగీరథ నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి తెలియదని, మారుమూల తండాల్లోనూ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
హైదరాబాద్ ప్రజలపై కక్ష : ప్రాజెక్టుల్లో నీరున్నా ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలని, మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీరు తేవచ్చుగా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓటు వేయలేదని హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టారా అని, చెప్పాలని డిమాండ్ చేశారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం(Kaleshwaram) నుంచి జల పరవళ్లు వస్తున్నాయని, సాగర్ నుంచి 14 టీఎంసీల నీరు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. మార్చి నెలలో హైదరాబాద్‌లో రెండు లక్షల ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ చెప్పారు.
జలమండలి వద్ద ధర్నా చేపడతాం : ట్యాంకర్లకు బిల్లు ప్రభుత్వం కడుతుందా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, అందుకు ట్యాంకర్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెంగళూరు(Bengaluru)లో చుక్క నీరు కూడా వృథా చేస్తే రూ.5000 జరిమానా వేస్తున్నారని తెలిపారు. వైఫల్యం, కుట్రతో నీరు ఇవ్వకుండా ప్రజల గొంతు ఎండగొట్టిన ప్రభుత్వమని, సీఎంకు ఏం జరిమానా వేయాలో ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తండని, ప్రజల గొంతు ఎండకుండా చర్యలు తీసుకోండని పేర్కొన్నారు. అవసరమైతే జలమండలి వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. జలమండలి బకాయిల కట్టాలని బిల్లులు ఇస్తున్నారని, వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KTR on Rahul Gandhi : బీఆర్ఎస్పై కక్షతో నీటిని సముద్రంలోకి వదిలారని, దేశంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీని మించిన చెల్లని నోటు ఇంకా ఎక్కడైనా ఉందా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 218 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనర్హతా పిటిషన్లు మూడు నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దానం, కడియం(Kadiyam Srihari) సభ్యత్వాలు రద్దయి ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ అన్నారు.
'కాళేశ్వరం స్కాం అని కేసీఆర్‌ను బద్నాం చేయాలి. నీళ్లు లేవు అని మాటలు చెప్పాలి. మీడియాలో మాత్రం ఇతర విషయాలు చూపించి, ప్రజల దృష్టి మళ్లించాలి. ఇది కాంగ్రెస్ తీరు.'- కేటీఆర్, మాజీ మంత్రి