KTR Serious on CM Revanth About Unemployed Problems : రేవంత్‌రెడ్డి రాజకీయం నిరుద్యోగం తీర్చుకోవడానికి, నాడు రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నవారి గురించి చేసిన వ్యాఖ్యలను, సీఎం ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోనందునే, నేడు ప్రభుత్వంపై తెలంగాణ యువత భగ్గుమంటోందని తేల్చిచెప్పారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అన్నారు. అలాగే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరారు.
అసెంబ్లీని స్తంభింపజేసేందుకు కూడా వెనుకాడం : ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న తరుణంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అవసరమైతే వాయిదా తీర్మానంతో శాసనసభను స్తంభింపజేసేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
"నిరుద్యోగుల విషయంలో ఇంత దారుణంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాదని చెప్పి, ఏ యువతైతే మమ్మల్ని దించి, కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించిందో ఈరోజు అదే యువత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా మిగిలిన నెలల్లో ఎలా ఇస్తారు మీరు చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు."-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR Tweet on Congress Assurance : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నిరుద్యోగులు తెలంగాణ యువతను రెచ్చగొట్టి తాము అధికారం దక్కించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. నిరుద్యోగులకు మోసపూరిత మాటలు చెప్పిన ఇద్దరికీ రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని, వీళ్ల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్, ఏడు నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు.
ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటే : హరీశ్‌రావు - Harish Rao on Employees Salaries