KTR Challenges CM Revanth Latest News 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానమైనా గెలవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరమూ రాజీనామా చేసి మల్కాజ్గిరి బరిలో నిలిచి తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేయాలని, తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండి ఆయన పరిధిలో ఎన్ని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గెలిచారని కేటీఆర్ ప్రశ్నించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
KTR Challenges to CM Revanth : రేవంత్ రెడ్డి వెంటనే రుణమాఫీ(Loan Waiver) చేయాలని, మహిళలకు నెలకు రూ.2,500, మిగిలిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఓడించలేదా రాహుల్ గాంధీ కూడా ఎన్నికల్లో ఓడిపోలేదా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గుర్తింపు సమస్యతో బాధపడుతున్నారని ఆయన మంత్రివర్గ సహచరులను గుర్తించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. భువనగిరి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసికట్టుగా పదవులు పంచుకున్నారని గుర్తు చేశారు. రెండు పార్టీల మధ్య స్పష్టంగా బంధం కనిపిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వంద రోజుల్లో అమలు కాకపోతే ఆ పార్టీని బొందపెడతాం : కేటీఆర్
"సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం బీజేపీకు పరోక్షంగా సహకరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Polls 2024) తర్వాత రాజకీయం రంజుగా ఉంటుంది. అందుకు హిమాచల్ ప్రదేశ్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నాము. తనను మేనేజ్ మెంట్ కోటా అంటున్న రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా. పీసీసీ పదవి, ముఖ్యమంత్రి పదవులను కొనుక్కున్నారు. దిల్లీకి కప్పం కట్టాలి కావున శివకుమార్, రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడాలి. బిల్డర్లు, గుత్తేదారులను బెదిరించాలి. బిల్డర్లు రోడ్డు ఎక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందరినీ వేధించి దిల్లీకి బ్యాగులు పంపాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని" బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
KTR Fires on CM : హైదరాబాద్ భవన నిర్మాణ అనుమతులు ఎందుకు ఆపేశారని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని పార్టీల అభిప్రాయాల ప్రకారమే 111జీవో ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఎక్కడ తప్పులు జరిగినా విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ప్రతీది సీఎం, మంత్రులకు తెలియాలని లేదు కానీ తప్పులు జరిగి ఉండవచ్చని తెలిపారు. కల్వకుర్తి నుంచి పారిపోయిన వంశీచంద్ కూడా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్థిత్వాలపై మార్చి రెండో తేదీ నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తారని కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో లోక్‌సభ హీట్ - బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ ఛాలెంజ్ - కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్
కార్యకర్తల త్యాగాలను మరవను - వాళ్లను గెలిపించేవరకు నా బాధ్యత తీరదు : సీఎం రేవంత్