KTR Tweet on Paddy Bonus in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ నేతలు ఎక్స్ వేదికగా ఆరోపించారు. హస్తం పార్టీకి ఆరు గ్యారంటీల్లో భాగంగా వరిపంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సన్న రకం ధాన్యానికి బోనస్ అని, దొడ్డు వడ్లకు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసం, దగా, నయవంచన అని కేటీఆర్ ఆక్షేపించారు.
KTR Responds To Rs. 500 Bonus on Paddy : ఆరు హామీల్లో వరిపంటకు రూ.500 బోనస్ అని ప్రకటించి, ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతారా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి, ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదు, రైతు వ్యతిరేక పాలనని విమర్శించారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక చావగొట్టారని, కరెంట్ కోతలతో పంటలను ఎండబెట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు.
ప్రతి ఏటా అన్నదాతలు, కౌలు రైతులకు రూ.15,000లు రైతు భరోసా అని హామీ ఇచ్చి, వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇస్తామని ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదని విమర్శించారు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టిందని ఆక్షేపించారు. ఓట్ల నాడు ఒకమాట, నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసిన హస్తం పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదని, నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్‌ను వారు ఇక వదిలిపెట్టరని అన్నారు. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారని, తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారని, కపట కాంగ్రెస్‌పై అన్నదాతలు సమరశంఖం పూరిస్తారని చెప్పారు. నేటి నుంచి కర్షకుల చేతిలోనే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ షురూ అయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Harish Rao Comments on Paddy Bonus : అన్నదాతలు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తోందని మండిపడ్డారు. కేవలం సన్నరకం ధాన్యానికే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందని విమర్శించారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలి : తెలంగాణలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని హరీశ్‌రావు అన్నారు. పది శాతం పండే సన్న రకం ధాన్యానికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు. వాటికి మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్లో ధర వస్తుందని, దొడ్డు రకానికే గిట్టుబాటు ధర రాదని తెలిపారు. బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే అని, అలా కాకుండా సన్న రకాలకే బోనస్ ఇస్తామనడం అదీ కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు - కేబినెట్ భేటీలో నిర్ణయం - Telangana Cabinet Meeting Decisions