KTR and Harish Rao Comments on MSME Programme : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన అంశంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన, ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి బీఆర్ఎస్ సాధించిన విజయాలను తమ ఘనతగా చెప్పుకోవడం శోచనీయమని హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీరిద్దరూ ట్వీట్స్ చేశారు.
ఎంఎస్ఎంఈల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా లెక్కలతో సహా వివరించిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌పై బురద చల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ లెక్కలు మాత్రం అబద్ధాలు చెప్పవని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదని అన్నారు. కేసీఆర్ హయాంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టిందనటానికి కాంగ్రెస్ చెప్పిన లెక్కలే నిదర్శనమన్నారు. గత పదేళ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధిరేటు 11 శాతం నుంచి 15 శాతం ఉందని ప్రభుత్వమే ఒప్పుకుందని అన్నారు.
ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చిందే బీఆర్ఎస్ : '2018-2023 మధ్యలో టీఎస్ఐపాస్ ద్వారా పెరిగిన సగటు పెట్టుబడులు 115 శాతం ఉంది. జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటాలో 10 శాతం వృద్ధి చెందిందని, ఏటా ఎంఎస్ఎంఈల సంఖ్య 15 శాతం పెరిగిందన్నారు. ఎంఎస్ఎంఈల కారణంగా ఉపాధి 20 శాతం పెరిగింది. ఎంఎస్ఎంఈల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలు 30 శాతం ఉద్యోగాలు పొందారు. 2020-2023 మధ్యలో అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మూసివేయబడ్డ రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నది అంతే నిజమని కేటీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమూ ఒప్పుకోక తప్పదని.' కేటీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ సాధించిన విజయాలను కాంగ్రెస్ ఘనతలు చెప్పుకోవడం ఏంటి : కేసీఆర్ పాలనలో ఎంఎస్ఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలు ఎంఎస్ఎంఈలను దృఢంగా నిలిపాయి. పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడమే కాకుండా ఉద్యోగాల కల్పనలో 20 శాతం వృద్ధిరేటు సాధించింది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30 శాతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటూ ఎక్స్ వేదికగా హరీశ్‌రావు విమర్శలు చేశారు.
రాష్ట్రం అప్పులపై సీఎం పదే పదే అబద్ధాలు చెబుతున్నారు : హరీశ్‌రావు - Harish Rao on CM Revanth