KTR and BRS Leaders Met Governor CP Radhakrishnan : రాష్ట్రంలో రాజ్యాంగహననం జరుగుతోందని, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నిరుద్యోగుల సమస్యలతో పాటు పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ ఉల్లంఘనల అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లింది. ఓవైపు రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెబుతున్న రాహుల్ గాంధీ, మరోవైపు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారన్న కేటీఆర్ ఫిరాయింపులకు సంబంధించిన అన్ని అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన పనులకు సంబంధించి అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు, అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతుందో గవర్నర్‌కు వివరించినట్లు తెలిపిన కేటీఆర్, విద్యార్థుల మీద నిర్బంధం, అణచివేత, అరెస్ట్‌లు, అక్రమ కేసులతో తెలంగాణ ఉద్యమం నాటి తరహాలో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి వాళ్లిచ్చిన ప్రకటనలు, హామీలు, గ్రూప్స్ పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చి పట్టించుకోవటం లేదని వివరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలగరాదని, ఈ విషయమై తాను ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల అంశంపై కూడా హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా తన పరిధిలో ఉన్నంతవరకు తగిన విధంగా స్పందిస్తానని, భవిష్యత్‌లో విపక్షాలుగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనను కలవాలని గవర్నర్ సూచించనట్లు చెప్పారు.
అక్రమంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఫిరాయింపుపై న్యాయ ప్రక్రియ నడుస్తోందని గవర్నర్‌కు తెలిపాం. సమస్యలపై గవర్నర్ వెంటనే స్పందించారు. - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్న కేటీఆర్, పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు లాభం వస్తుందని గతంలో అన్న సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేయడంతో ఎంత వాటా వస్తుందని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం అద్భుతంగా నిర్మించారని గవర్నర్ బీఆర్‌ఎస్ నేతలతో అన్నట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా ఆయన వాకబు చేసినట్లు తెలిసింది.
దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన పోరాట ఫలితమే కాళేశ్వరం : కేటీఆర్ - KTR on Kaleshwaram project
కొండ నాలుకకు మందేస్తే - ఉన్న నాలిక ఊడినట్లుంది : కేటీఆర్ - KTR Tweet On Pension Recovery