Kishan Reddy on Rahul Gandhi and CM Revanth : తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వస్తోందని, దేశ భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీకే ఓటు వేస్తామంటున్నారన్నారు. రేపు ఎల్బీ స్టేడియం వేదికగా హైదారాబాద్, చేవెళ్ల, భువనగిరి, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సభ తమకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఐదుగురు లోక్‌సభ అభ్యర్థులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై సామాజిక స్పృహతో ఉండాల్సిన వ్యక్తులు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
kishan reddy on KCR : రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపైన చేసిన వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. వారు కుట్రతో చేసిన సినిమా ప్లాప్ అయ్యిందని, బాక్సులు కూడా గాంధీ భవన్‌కు చేరుకున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీపై బురద జల్లేందుకు అనేక రకాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీల ఎన్నికల జిమ్మిక్కులు తెలుసని, ప్రజలు ఎవరూ కూడా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవడంలేదని కిషన్‌రెడ్డి అన్నారు. వాళ్లను చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలతో అనేక అంశాల్లో సంభాషించారని చెప్పారు. అబద్ధాలు, గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్‌కే పరిమితమవుతాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ప్రచారానికే గాడిద గుడ్డు ఉపయోగపడుతోందని వ్యంగ్యంగా మాట్లాడారు.
'మహబూబ్‌నగర్ నారాయణపేటలో ప్రధాని మోదీ ప్రసంగించి మధ్యాహ్నం తర్వాత 4 గంటలకు హైదరాబాద్‌లో సభలో పాల్గొననున్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి లాస్ట్ మీటింగ్. యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మా భవిష్యత్ కోసమే ఓటేస్తామని ప్రజలు అంటున్నారు'- జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయింది : కిషన్‌రెడ్డి - Kishan Reddy Comments on CM Revanth