Kishan Reddy on Paddy Bonus in Telangana : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మందకొండిగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, ఇలా అయితే మొత్తం ధాన్యం కొనేందుకు మరో 2 నెలలు పడుతుందని తెలిపారు. కేంద్రం 50 లక్షల టన్నుల వడ్లు కొనేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై మాట్లాడారు.
Kishan Reddy Comments on Congress : కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం సన్న వడ్లకే ఇస్తాననడం బాధాకరమని అన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారని పేర్కొన్నారు. సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగామాగం చేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వరి రకాలకు తేడా లేకుండా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వివరించారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసింది. చాలా తక్కువ మంది రైతులే సన్నవడ్లు పండిస్తారు. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారు. 50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉంది. భవిష్యత్‌లోనూ ఉంటుంది." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
RYTHU Runa Mafi Issue in Telangana : రాష్ట్రవ్యాప్తంగా 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇలానే కొనసాగితే మొత్తం అయ్యేసరికి రెండు నెలలు పడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. డిసెంబరు 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు.