Kishan Reddy on Congress over Medigadda Barrage Visit : రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన తెరపైకి తీసుకువచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయానికి రాని మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు హాజరు కాని శాసనసభ్యుడు కృష్ణా జలాలపై బహిరంగ సభలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం మానుకోవాలని హెచ్చరించారు.
ఎన్నికల ముందుగానే మేడిగడ్డ పర్యటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పర్యటన చేశారో, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచనతోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను సైతం ముగించుకొని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మేడిగడ్డ సందర్శనకు తీసుకుపోయారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతిన్నడంపై గతంలోనే జల శక్తి వనరుల శాఖ మంత్రికి లేఖ రాశామని సీబీఐ ద్వారా విచారణ చేయాలని అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరామని వివరించారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మద్యం కేసులో కవితను అరెస్టు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, సుప్రీంకోర్టు విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేస్తే తప్పకుండా విచారణ చేస్తామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.
Kishan Reddy Fires on BRS and Congress : తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(BRS), కాంగ్రెస్ పార్టీలను మట్టి కల్పించడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్రంలో పొత్తులు ఉండే అవకాశం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని వివరించారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో మోదీ విజయం సాధించారని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బలపడ్డ స్థానాలను సైతం బీజేపీ(BJP) కైవసం చేసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓవైసీ సీటుపై కుడా కమలం పువ్వు జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే తమ ఓటును మూసీ నదిలో వేసినట్టేనని వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని అన్నారు.
'వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మెజార్టీ సాధించే మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ నిరాశ నిస్పృహలో ఉన్నాయి. రెండు పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతున్నారు'- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
17 ఎంపీ సీట్లే లక్ష్యం - లోక్‌సభ ఎన్నికల కోసం 35కు పైగా బీజేపీ కమిటీలు
నేడు మేడిగడ్డలో సీఎం, ప్రజాప్రతినిధుల పర్యటన - 800 మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు