Khammam Congress MP Candidate Issue : ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఎంపీ అభ్యర్థి ఎంపిక రాజకీయ కాక పుట్టిస్తోంది. అత్యంత హాట్ సీటుగా ఉన్న ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు హేమాహేమీలు పోటీ పడుతుండటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబీకులతోపాటు పలువురు సీనియర్లు సైతం ఈ సీటుపై కన్నేశారు.
వరుస భేటీలు, వ్యక్తిగత అభిప్రాయాల సేకరణ, జిల్లా ముఖ్య నేతలతో సంప్రదింపులు చేస్తున్నప్పటికీ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అగ్రనేతలకు ప్రహసనంగా మారింది. ఇప్పటివరకు నాలుగుసార్లు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైనప్పటికీ అభ్యర్థిని తేల్చకపోవడం చూస్తుంటే ఖమ్మం సీటుకు ఎంత పోటీ ఉందో కళ్లకు కడుతోంది. ముఖ్యంగా ముగ్గురు మంత్రుల కుటుంబీకులు టికెట్ ఇప్పించుకునేందుకు రాష్ట్ర, దిల్లీ స్థాయిలో సర్వశక్తులొడ్డుతున్నారు.
అధిష్ఠానం టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామంటూ ఓ మంత్రి (TS Ministers For Khammam Seat) చెబుతున్నప్పటికీ మిగిలిన ఇద్దరు మాత్రం పట్టు వీడట్లేదని సమాచారం. తమ వారికి టికెట్ దక్కించుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తుండటంతో అమాత్యుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ఖమ్మం నుంచి బరిలో దిగుతారని ప్రచారం సాగింది.
Priyanka Gandhi To Contest From Khammam : రాహుల్‌గాంధీ పోటీ వయనాడ్ నుంచి ఖాయమవడంతో అందరి దృష్టి ప్రియాంకపైనే ఉంది. జిల్లా నేతల మధ్య సఖ్యత కుదరక పోతే ప్రియాంక గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు అమాత్యుల హోరాహోరీ సాగుతండగా బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పుట్టుకొస్తోంది. ఖమ్మం టిక్కెట్ అంశంపై ముగ్గురు మంత్రులే తేల్చుకోవాలని లేదంటే తమ వద్ద మరో బలమైన అస్త్రం ఉందని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఖమ్మం బరిలో సత్తా చాటాలని ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమౌతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు మరోసారి నామా నాగేశ్వరరావును బరిలో నిలిపిన బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించింది. రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో సాగుతున్న బీజేపీ సైతం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త తాండ్ర వినోద్‌రావును అభ్యర్థిగా ప్రకటించింది.
ఇప్పటికే బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం (BJP Election Campaign in Khammam) నిర్వహిస్తున్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం కార్యకర్తలకు నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. ఈనెల 31న మరోసారి జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలోనైనా అభ్యర్థి ఎంపిక కొలిక్కి రావాలని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.