Khammam Lok Sabha Candidates Election Nomination : ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి నెలకొంది. ఈ రోజు ఆఖరి తేదీ కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో మొత్తం 51 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, మహబూబాబాద్ స్థానంలో 25 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామపత్రాలు దాఖలు చేశారు. రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఖమ్మం లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్-రామసహాయం రఘురామిరెడ్డి, బీజేపీ-తాండ్ర వినోద్‌రావు బరిలో ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, కాంగ్రెస్-పోరిక బలరాం నాయక్, బీజేపీ- సీతారాం నాయక్ పోటీలో ఉన్నారు.
Khammam Congress Candidate Election Nomination : సుధీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ, ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. సుధీర్ఘ మంతనాల తర్వాత బుధవారం రాత్రి ఆయన పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఈరోజు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్‌కు రెండు సెట్ల నామ పత్రాలు విడివిడిగా అందజేశారు. మొదటి సెట్ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేను సాంబశివరావులోతో కలిసి వేశారు. రెండో సెట్ మంత్రి పొంగులేటి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌లతో కలిసి నామ పత్రం ఇచ్చారు.
"సోనియా గాంధీ జిల్లా అధ్యక్షులు అందరి నిర్ణయాలను, అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే వారికి టికెట్ ఇచ్చారు. ఖమ్మం ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకుని విజయపథంలో నడిపించారో, లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే తరహాలో కాంగ్రెస్‌ను గెలిపించాలి. రామసహాయం వాళ్ల కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారి తండ్రి రాజకీయాల్లో ఉండేవారు. వారు ఇప్పుడు సేవచేయడానికి ఎంపీగా పోటీ చేయాలి అని అనుకుంటున్నారు." - తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
Lok Sabha Elections 2024 : అంతకు ముందు ఖమ్మం కాలువ రోడ్డు నుంచి నూతన కలెక్టరేట్ వరకూ భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తుమ్మల జిల్లాలో అందరీ అభిప్రాయం మేరకు అధిష్ఠానం రామసహాయం పేరు ప్రకటించారని, అందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. జిల్లాలో నాయకులందరూ ఒకే తాటిపై ఉండి భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థిని గెలుపించుకుందామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ జిల్లా అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తర్వాతే అభ్యర్థిని ఖరారు చేసినట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎన్నికల నేపథ్యంలో ఇతర పనులు ఉండడంతో నామినేషన్‌కు రాలేకపోయారని పేర్కొన్నారు. వారికి అవకాశం కుదిరినప్పడు ఖమ్మం ప్రజల గురించి మాట్లాడాటానికి తప్పకుండా ఖమ్మంకు రావాలని పొంగులేటి కోరారు. ఒక్క అవకాశం ఇస్తే ఖమ్మం ప్రజలకు సేవ చేసుకుంటానని అభ్యర్థి రామసహాయం చెప్పారు.
"అధిష్ఠానం అందరి సూచనలు, అభిప్రాయం మేరకే రఘురామిరెడ్డి టికెట్ ఇచ్చారు. దేశాన్ని గాడిలో పెట్టాలి అంటే కేవలం అది సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలి." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి