Lok Sabha Election Fight in Khammam and Mahabubabad : ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు మూడు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు నియోజకవర్గాల్లో గెలవాలని ముఖ్యనేతలు వారి భుజస్కందాలపై వేసుకుంటున్నారు. ప్రచార వ్యూహాలు మొదలుకొని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో ప్రచారపర్వాన్ని మరింత పెంచేలా మంత్రులు బాధ్యతలు చూస్తున్నారు.
ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికల బాధ్యులుగా ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ గెలుపును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఈ రెండు నియోజక వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక చేశారు. ఖమ్మం అభ్యర్థి పోటీలో అమాత్యులు చివరి వరకు పోటాపోటీగా ప్రయత్నించారు. చివరకు పొంగులేటి వియ్యంకుడు రఘురాంరెడ్డికే అభ్యర్థిత్వం దక్కింది. మహబూబాబాద్ అభ్యర్థిగా బలరాం నాయక్ బరిలో ఉన్నారు.
వీరిద్దరి గెలుపు కోసం పార్టీ అధిష్ఠానం సూచనలతో మంత్రులంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. రెండు జిల్లాల పార్లమెంటు అధ్యక్షులు దుర్గాప్రసాద్, పొదెం వీరయ్య నేతల మధ్య సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సమావేశాలు, సమన్వయ భేటీలు పూర్తి చేసుకుని వచ్చే 13 రోజులపాటు కలిసికట్టుగా విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ముఖ్యనేతలంతా కలిసి రోడ్ షోలు, ప్రచార సభలు హోరెత్తించేలా నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.
బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు
బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను నిలుపుకుంటుందా : ప్రస్తుతం అయితే ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీలుగా నామ నాగేశ్వరరావు, మాలోత్ కవితలను మరోసారి గులాబీ దళపతి బరిలో నిలిపారు. వీరిద్దరి గెలుపు బీఆర్ఎస్ నేతలకు సవాల్‌గానే మారింది. ఎందుకంటే ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఈ క్రమంలో రెండు సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడం బీఆర్ఎస్కు సవాల్నే అని చెప్పాలి. గెలుపు కోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మాజీ ఎమ్మెల్యేలకు అధిష్ఠానం బాధ్యతలను అప్పగించింది. వారు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ఒక్కచోటైనా బీజేపీ విజయం సాధిస్తుందా : మరోవైపు రెండు లోక్‌సభ స్థానాల్లో పలువురు ముఖ్యనేతలు బీజేపీకు పెద్దదిక్కుగా మారి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రెండు నియోజకవర్గాల్లో బీజేపీ విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లును అభ్యర్థిస్తున్నారు. మూడోసారి మోదీ ఖమ్మం, మహబూబాబాద్‌తో జోడీ అన్న నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోంది. బీజేపీ అభ్యర్థులు తాండ్ర వినోద్ రావు, సీతారాం నాయక్‌లకు మద్దతుగా ముఖ్యనేతలంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రచార బాధ్యతలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదివాసీ ఓటర్లపై ప్రధాన పార్టీలు మూడు దృష్టి సారించాయి.
పట్టభద్రుల ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు సిద్ధమైన బీజేపీ - ఆ ముగ్గురిలో ఛాన్స్ కొట్టేసేది ఎవరో?
ఉమ్మడి ఖమ్మం మొత్తం కాంగ్రెస్‌దే - హస్తం పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావు