Warangal BRS Lok Sabha Candidate 2024 : వరంగల్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన సుధీర్ కుమార్, 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పని చేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నేతలతో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేసి ప్రకటించారు.
కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ మరో అభ్యర్థిని ఖరారు చేయాల్సి వచ్చింది. సుధీర్ కుమార్తో పాటు పలు పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేరు కూడా చర్చకు వచ్చింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా రాజయ్యతో మాట్లాడారు. ఇవాళ కేసీఆర్ను కలిసేందుకు కూడా ఆయనకు పిలుపు వచ్చింది. ఎర్రవెల్లి వెళ్తూ మార్గమధ్యంలో ఒక దగ్గర ఆగి పిలుపు కోసం వేచి చూశారు. ఈలోపు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్, వరంగల్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు.
వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ తీవ్ర కసరత్తు
అభ్యర్థి విషయమై బీఆర్ఎస్ అధిష్ఠానం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేసింది. స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపింది. కడియం కావ్య తప్పుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. రాజయ్య సైతం పోటీకి సుముఖత వ్యక్తం చేయగా, ఆయనతో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న, జిల్లా పరిషత్ ఛైర్మన్ సుధీర్, జడ్పీటీసీ శ్రీనివాస్, వైద్యులు సుగుణాకర్ రాజు సహా మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఎవరైతే మెరుగైన అభ్యర్థిగా ఉంటారన్న విషయమై ఇటీవల పార్టీ అధిష్టానం ఆరా తీసింది.
మొన్నటిదాకా ఒకే పార్టీ - నేడేమో వారి మధ్యే పోటీ - రసవత్తరంగా వరంగల్ లోక్‌సభ పోరు
లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల బరిలో నిలపాలని బీఆర్ఎస్ అధిష్టానం ఇదివరకే సూత్రప్రాయంగా నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల కార్యచరణ, అభ్యర్థిత్వం విషయమై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు గత సోమవారం సమావేశమై చర్చించారు. ఆశావహులకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కలిసికట్టుగా పని చేసి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నిర్ణయించారు. అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అధినేత కేసీఆర్ నిర్ణయానికే నేతలు వదిలిపెట్టారు. అభ్యర్థి ఎవరైనా కష్టపడి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు వరంగల్ నేతలతో సమావేశమైన కేసీఆర్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు.
వరంగల్ బరిలో కాడియం కావ్య- ఆ 3 సీట్లపై ఇంకా రాని స్పష్టత - lok sabha elections 2024