KCR Bus Yatra In Telangana : సోమవారం రోజున మిర్యాలగూడ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో ప్రజల్లోకి మరింతగా వెళ్లే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కేసీఆర్‌తో సమావేశమైన కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్యనేతలు బస్సుయాత్ర నిర్వహణ, రూట్ మ్యాప్‌పై సమీక్షించారు. రోజుకు ఐదు నుంచి ఆరు కార్నర్ మీటింగుల్లో ప్రసంగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సోమవారం నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
BRS Lok Sabha Election Campaign 2024 : ఈ మేరకు బస్సుయాత్ర అనుమతి కోసం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం అందించారు. కేసీఆర్ యాత్రకు తగిన భద్రత కల్పించాలని సీఈవోను కోరారు. ఈనెల 22న మిర్యాలగూడ నుంచి బీఆర్ఎస్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సాగర్ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడంతో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో మూడు, నాలుగు ప్రాంతాల్లో బస్సుయాత్ర జరగనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్ - BRS Lok Sabha Election Campaign
ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలను తెలుసుకుంటానని కేసీఆర్ చెప్పారు. సాయంత్రం పూట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకొని బస్సు యాత్ర కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటలో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ముగింపు సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ, ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది.