Kavitha ED Custody Updates Today : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు.
Delhi Liquor Scam Update Today : మరోవైపు కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆన్‌లైన్‌లో కోరారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు, కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకూ ఈ రిమాండ్ కొనసాగనుంది. దీంతో అధికారులు ఆమెను తిహాడ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
జైలులో ప్రత్యేక వెసులుబాట్లు : మరోవైపు కవిత విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఆమెకు జైలులో ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఇంటి భోజనం తెచ్చుకునేందుకు, మంచం, పరుపులు, చెప్పులు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పాటు దుస్తులు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, నగలు, మందులు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది.
దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - Delhi Liquor Scam Updates
కడిగిన ముత్యంలా బయటకు వస్తా : తనను కోర్టుకు తరలించే సమయంలో కవిత మాట్లాడారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తనను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చునని, తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని అన్నారు. దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక నిందితుడు భారతీయ జనతా పార్టీలో చేరాడని, మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇస్తోందన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు బాండ్ల రూపంలో ఆ పార్టీకి ఇచ్చారని కవిత ఆరోపించారు.
దేశవ్యాప్తంగా సంచలనం : రాజకీయ, వ్యాపారవేత్తల వరుస అరెస్టులు, విచారణలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధముందని ఆరోపిస్తూ ఈ నెల 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, 16న దిల్లీలోని పీఎంఎల్ఏ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపర్చింది. అటు కవిత, ఇటు ఈడీ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం, వారం పాటు ఆమెను కస్టడీకి అనుమతించింది. ఈ సమయంలో వివిధ అంశాలపై కవితను విచారించిన అధికారులు, లిక్కర్ కేసుకు సంబంధించి వివరాలు రాబట్టినట్లు తెలిసింది.
‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’ - సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
కస్టడీ గడువు గత శనివారంతో ముగియడంతో ఈడీ అధికారులు, మళ్లీ ఆమెను అదే కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా మిగిలి ఉన్నందున మరో 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజులు కస్టడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గడువు ఇవాళ్టితో ముగియడంతో కవితను మరోసారి కోర్టు ముందు హాజరుపర్చారు. ఆన్‌లైన్‌లో హాజరైన ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్, కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరగా, కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆమెను తిహాడ్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
దిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ