Bandi Sanjay Fires on Congress in Sircilla Election Campaign : కరీంనగర్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్కు అభ్యర్థులు కూడా కరువయ్యారని ఆ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్, రైతులను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని పోరాటం చేసింది తామే అని గుర్తు చేశారు.
గత 5 ఏళ్లల్లో గ కరీంనగర్ నియోజకవర్గానికి రూ.12వేల కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కరోనా సమయంలో బీజేపీ నాయకులు ప్రజలకు అనేక సేవలు అందించారన్న ఆయన, సేవలు చేస్తూ 8మంది కార్యకర్తలు మరణించారని చెప్పారు. కానీ అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కనీసం బయటకు రాలేదని అన్నారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తుందని విమర్శించారు.
అంతకముందుకు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరులో పర్యటించారు. అక్కడ కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదని తెలిపారు. పార్టీలు, కులాలకు అతీతంగా జనగాం జిల్లాకు ఆ పేరు పెడితే హర్షిస్తామని ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
"మా కార్యకర్తలు రాముని గుడి కోసం ప్రాణత్యాగం చేశారు. తెలంగాణలో రామ రాజ్యం రావాలి. రాముని పేరు చెప్పి ఉంటాం కానీ ఓట్ల కోసం మాత్రం కాదు, భక్తితో చెప్పి ఉంటాం. మేము రాముని పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదు. కానీ అవతలివారు రాముని పేరు చెప్పగానే భయపడుతున్నారు. ఎవరి అకౌంట్లో అయినా 2500 రుపాయలు పడ్డాయా? ఆరు గ్యారంటీలు అనగానే ఓట్లన్నీ అటే వేశారు. ఇళ్లు కట్టుకోడానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. ప్రజల దగ్గరి నుంచి గుంజుకోకపోతే చాలు. బీఆర్ఎస్ వాళ్లు కేసులు పెట్టింది మా పైన, జైలుకు వెళ్లింది మేము. కానీ మీరు ఓట్లు వేసింది మాత్రం కాంగ్రెస్ వాళ్లకు." - బండి సంజయ్, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి