Home Minister Anitha on Ganja : గత ఐదు సంవత్సరాల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం గంజాయిమయమైందని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అన్నపూర్ణగా దేశంలో పేరొందిన ఏపీ, వైఎస్సార్సీపీ హయాంలో గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి సరఫరాలో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం నిలిచిందని, గంజాయి వినియోగంలోనూ రికార్డు నెలకొల్పిందని శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానంగా చెప్పారు.
కాలేజీ విద్యార్థులే టార్గెట్ - గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
రాష్ట్రంలో గంజాయి సహా మాదక ద్రవ్యాలను నిర్మూలనకు కృషి చేస్తున్నామని వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గంజాయిని సాగు నివారణ చర్యలు తీసుకోవడం సహా సహా గంజాయి, డ్రగ్స్ ని పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాంటీ నార్కోటిక్స్ టాక్స్ ఫోర్స్ విభాగాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని సైతం కర్రీ లీఫ్ పేరిట ఆన్ లైన్లో డోర్ డెలివరీ చేశారని మంత్రి అనితి ఆక్షేపించారు. వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగిందని తెలిపారు. ఎస్ఈబీ ఏర్పాటు పేరిట ఎక్సైజ్ శాఖను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వ్యసనాలకు బానిసై 1745 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎక్సైజ్ విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా సానుభూతి పరులపై ఎక్కడా ఉద్దేశ పూర్వకంగా దాడులు జరగడం లేదని హోం మంత్రి వంగల పూడి అనిత తెలిపారు. యాద్దృచ్చికంగా జరిగిన చిన్నపాటి ఘటనలను పెద్దవి చేసి చూపుతూ వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో 36 మందిని రాజకీయ హత్యలు చేశారని దిల్లీ వేదికగా వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల గవర్నర్‌ను కలిసినపుడు 31 మంది ని హత్యకు గురయ్యారని చెప్పిన జగన్, దిల్లీ వెల్లగానే సంఖ్య పెంచి దుష్ప్రచారం చేస్తున్నారని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడా రాజకీయ హత్యలు జరగలేదని స్పష్టం చేసిన హోం మంత్రి జగన్ చెబుతోన్న వివరాలపై బహిరంగ చర్చకు తాను సిద్దమన్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి విచారణ జరిపేందుకు తాను సిద్దమని జగన్ కూడా రావాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలకు భంగం వాటిళ్లకుండా అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని, పోలీసు వ్యవస్థను బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గంజాయి నిర్మూలనపై నాదెండ్ల మనోహర్ కఠిన ఆదేశాలు! - janasena nadendla manohar on ganja