High Community Leaders Ruling Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయం అంతా ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కనుసన్నల్లోనే జరుగుతోంది. ఆయన చెప్పిన వారికే టికెట్లు దక్కుతున్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌ను తప్పించారు.
పెద్దిరెడ్డి వ్యాపారాలకు ఆసరాగా ఉన్న వేణురెడ్డి చేతుల్లో ఆ నియోజకవర్గాన్ని పెట్టారు. వేణు భార్య టీఎన్ దీపిక ‘బీసీ’అని హిందూపురం పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అదే బీసీ వర్గానికి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన స్థానంలో బళ్లారికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు సోదరి జొలదరాశి శాంతను లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ నియామకమూ పెద్దిరెడ్డి వల్లే జరిగింది. ఇక్కడ పెద్దలు ఆడిన బంతాటలో బడుగు నేతలు బలయ్యారు.
అడుగడుగునా ఇబ్బందులు: పెనుకొండ నియోజకవర్గంలో తొలి నుంచీ ఎమ్మెల్యే శంకరనారాయణకు అడుగడుగునా ఆ ‘పెద్ద’ సామాజికవర్గ నేతల నుంచి ఇబ్బంది తప్పలేదు. పెనుకొండ మండలంలో కుప్పం సుధాకర్‌రెడ్డి, కర్ర సంజీవరెడ్డి, గోరంట్ల మండలంలో గంపల రమణారెడ్డి, పాలసముద్రంలో దిలీప్‌రెడ్డి, రొద్దం మండలంలో సి. నారాయణరెడ్డి, సోమందేపల్లి మండలంలో వైస్ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, ఈదులబలాపురంలో నాగభూషణరెడ్డి, రమాకాంతరెడ్డి, సజ్జారెడ్డి, ఎల్లారెడ్డి, ఈశ్వరరెడ్డి, చాలకూరు జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యేని వ్యతిరేకించారు.
"పెద్దాయన" ఇలాకాలో అరాచకం.. ప్రశ్నిస్తే, కేసులు-దాడులు
తిప్పేస్వామికి తిప్పలు తప్పలేదు: మడకశిరలో సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి తిప్పలు తప్పలేదు. ఆయన్ను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఆనంద రంగారెడ్డితో పాటు మరికొందరు నేతలు వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను తీసేయాల్సిందేనని పట్టుబట్టి సాధించారు. తిప్పేస్వామిది రాజకీయ కుటుంబం, ఆయన వైద్యుడు కావడంతో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. అది ఆ నేతలకు రుచించలేదు. అందువల్లే ఎలాంటి రాజకీయ బలం లేని ఒక గ్రామస్థాయి వ్యక్తిని ఎంపిక చేసి ఆయన్నే నియమించేలా చేసుకోగలిగారు.
వీరికి మినహాయింపు: ఎస్సీ, బీసీల్లో కొందరికి ఆ ‘పెద్ద’సామాజికవర్గం మినహాయింపు ఇచ్చింది. బీసీ అయిన మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మార్చారు. ఆమె భర్త చరణ్ ‘రెడ్డి" కావడం వల్లే ఈ మినహాయింపు ఇచ్చారు. పెనుకొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారాయణను అక్కడ నుంచి తప్పించారు. ఎందుకంటే ఇక్కడి ‘పెద్ద’సామాజికవర్గ నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు.
సొంత జిల్లా సత్యసాయిలో ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి అవకాశం కల్పించాలని కోరినా పార్టీ అగ్రనాయకులు పట్టించుకోలేదు. కానీ జిల్లాలో శంకరనారాయణ సామాజికవర్గం అధికంగా ఉండటంతో ఆ ఓట్లు రాబట్టుకునేందుకు ఆయన్ను అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని ఈసారి తప్పించారు. కానీ ఆమె భర్త సాంబశివారెడ్డి తీసుకొచ్చిన వీరాంజనేయులునే పార్టీ సమన్వయకర్తగా నియమించారు. పేరుకు సమన్వయకర్త వీరాంజనేయులే అయినా పెత్తనం మాత్రం సాంబశివారెడ్డిదే.
పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు