Harish Rao Meets Motilal Naik At Gandhi Hospital : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్‌ను పరామర్శించారు. వారం రోజులుగా మోతీలాల్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే చిటికేస్తే ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాటతప్పారని ప్రశ్నించారు.
మోతీలాల్ చేస్తున్న నిరాహారదీక్షను విరమించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరామని హరీశ్ రావు తెలిపారు. అయినా ఆయన తమ మాట వినకుండా డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగిస్తానని చెప్పినట్లు వెల్లడించారు. నిరుద్యోగులపై కపట ప్రేమ చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు వారి గుండెల మీద తన్నుతోందని ధ్వజమెత్తారు. అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. కోదండరాం పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలని వాటి అమలు చేసే విధంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా? - ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇప్పుడు ఎందుకు కాదు : గతంలో ధర్నాలు చేసిన రియాజ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నలకు ఉద్యోగాలు వచ్చాయని, ప్రస్తుతం ఆందోళనలు చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతోందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1:100 ఒక్క పోస్ట్‌కు వందమంది చేసేలా నోటిఫికేషన్‌లో మార్పులు చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం అయిన 1:100 తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
"సామాజిక మాధ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిసే పేర్లు కౌంట్ అవుతున్నాయి అని భయపెడ్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రూప్ 1,2,3,4 పోస్టులు పెంచాలి. నిరుద్యోగ భృతి రేవంత్ ఎందుకు ఇవ్వడం లేదో రాహుల్ గాంధీ ప్రశ్నించాలి. మోతీలాల్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. కిడ్నీలో నొప్పి అంటున్నారు. గ్రూప్స్ అభ్యర్థి మోతీలాల్ ప్రాణానికి హాని కలిగితే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆయనకేదైనా జరిగితే అసెంబ్లీని స్తంభిపజేస్తాం. నిరుద్యుగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలపై చర్చించాలి." అని హరీశ్ రావు అన్నారు.
ఉద్యోగాలపై కాంగ్రెస్ మాట అప్పుడలా ఇప్పుడిలా : హరీశ్‌రావు - Harish Rao Fires On Congress