Harish Rao Slams CM Revanth Over Attacks On BRS : కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగినప్పుడు డీజీపీ ఎందుకు స్పందించలేదు? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని నిలదీశారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వస్తే తమను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఖమ్మం, సిద్దిపేటలో తమపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు.
బీఆర్‌ఎస్ నేతలపై దాడులు జరిగితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని హరీశ్ రావు ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిపై దాడికి సీఎం రేవంత్‌రెడ్డే కారణం అని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్న హరీశ్‌రావు, సీఎంను చూసే మిగిలిన నేతలు నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు. అరెకపూడి గాంధీని నిన్నే హౌస్ అరెస్టు చేసి ఉంటే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగేది కాదని హరీశ్‌రావు అన్నారు.
"కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు మేము సహకరించాం. ఇది కేసీఆర్, రేవంత్‌రెడ్డి నాయకత్వానికి ఉన్న తేడా. రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యం గురించి అమెరికాలో మాట్లాడుతున్నారు. తెలంగాణలోని అరాచకపాలన గురించి రాహుల్‌గాంధీ మాట్లాడాలి. రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు." - హరీశ్‌రావు, మాజీ మంత్రి
ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును పక్కదారి పట్టించడానికే కౌశిక్‌రెడ్డిపై దాడికి దిగారని హరీశ్‌రావు ఆరోపించారు. రుణమాఫీపై ప్రశ్నిస్తే సిద్దిపేటలో కార్యాలయంపై దాడి చేశారని, వరదలపై ప్రశ్నిస్తే ఖమ్మంలో దాడి చేశారని అన్నారు. తమపై ఎన్ని రాళ్లు వేస్తావో వేయండి, వాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు. పోలీసుల గౌరవం తగ్గకూడదనే సహకరిస్తున్నామన్న ఆయన, దాడి చేయాలనుకుంటే తామూ చేయగలమని తెలిపారు. రాష్ట్రం బ్రాండ్ దెబ్బతినకూడదనే సంయమనం పాటిస్తున్నామని వెల్లడించారు.