Harish Rao on Congress Guarantees : కాంగ్రెస్ నేతలు ఆరు నెలల్లో గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆ పార్టీపై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే, పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లవుతుందని పేర్కొన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు హామీలు అమలు చేశారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని, హస్తం పార్టీ హయాంలో బావుల వద్ద మోటార్లు కాలుతున్నాయని మండిపడ్డారు.
కల్యాణ లక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని, మహిళలకు బంగారం ఇవ్వడం ఏమో కానీ గోల్డ్ ధరలు కొండెక్కాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి బంద్ అయ్యిందని, ఓటుతో ఆ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గజ్వేల్ రూపురేఖలు మార్చిన కేసీఆర్‌ను దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేస్తే నీళ్లు లేని బావిలో పడినట్లవుతుందని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసినట్లు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారని, హామీలు అమలు చేయని మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.
Harish about BRS : కాంగ్రెసోళ్లు ఏమో దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నారని, బీజేపీ ఏమో మనపై భారం పెడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిచిన వెంటనే విద్యార్థుల విద్యకు, ఉద్యోగాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో రూపాయికే శుభ కార్యక్రమాలు చేయిస్తానని అంటున్నారని చెప్పారు. అందుకే ఆయనను ఆశీర్వదించి ఓటేయాలని కోరారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజలు మధ్య ఉండి వారి కోసమే పనిచేసేది బీఆర్ఎస్ అని ఉద్ఘాటించారు.
'రైతు బంధు, కల్యాణలక్ష్మి, రూ.4 వేల పెన్షన్, తులం బంగారం గురించి కేసీఆర్ ప్రశ్నిస్తే, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను దూషిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను, నీకంటే పెద్దవారిని కరోనా సమయంలో 10 కీలోల బియ్యం ఇచ్చి పేదవాళ్లను కాపాడిన ఆయనను తిట్టోంచా. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే. మీ అందరీ అభిమాన నాయకుడు. మీరు గెలిపిస్తే గెలిచిన నాయకుడు. అందుకే సీఎం రేవంత్‌కు, కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి'- హరీశ్‌రావు, మాజీ మంత్రి