KTR on CM Revanth about Musi River Project : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరి మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలి అన్నట్లు ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌పై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అప్పుల పాలైందని, డబ్బులు లేవని తెల్లారిలేస్తే బీద అరుపులు అరుస్తున్నారని మండిపడ్డారు. మరొకవైపు మూసీ పేరిట లక్షా యాభై వేల కోట్ల రూపాయల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని ప్రశ్నించారు. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు, రైతుబంధుకు డబ్బులు లేవని విమర్శించారు. రైతు కూలీలకు డబ్బులు లేవు, కౌలు రైతులకు డబ్బులు లేవన్న ఆయన, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవని, పేదవాళ్లకు పెన్షన్లకు డబ్బులు లేవని పేర్కొన్నారు.
మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి
— KTR (@KTRBRS) October 7, 2024
తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని.
మరొకవైపు మూసి పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం?
❌ రైతు రుణమాఫీకి డబ్బులు లేవు
❌ రైతుబంధుకి…
మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుకు డబ్బులు లేవని, ఆడపిల్లలకు స్కూటీలకు డబ్బులు లేవని కేటీఆర్ ఎక్స్‌లో విమర్శించారు. ఉద్యోగస్తులకు డీఏలకు డబ్బులు లేవని, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలకు డబ్బులు లేవని ఆరోపించారు. గ్రామాల్లో పిచికారీ మందులకు డబ్బులు లేవన్న ఆయన, బడిపిల్లలకు చాక్ పీసులకు కూడా డబ్బులు లేవని, దవాఖానలో మందులకు డబ్బులు లేవని పేర్కొన్నారు. దళితబందుకు డబ్బులు లేవని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు డబ్బులు లేవని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవని, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవని అన్నారు. చెరువుల్లో చేపపిల్లలు పెంచడానికి డబ్బులు లేవన్న కేటీఆర్, రెండో విడత గొర్రెల పంపిణీకి డబ్బులు లేవని ఆరోపించారు.
రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదు : పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారని, కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమని ఆరోపించారు. ఓవైపు సాగునీటి సంక్షోభమని, మరోవైపు రుణమాఫీ ద్రోహం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారు
— KTR (@KTRBRS) October 6, 2024
కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారు
ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణం
ఓవైపు సాగునీటి సంక్షోభం
మరోవైపు రుణమాఫీ ద్రోహం
ఇంకోవైపు రైతుభరోసా మోసం
కౌలు రైతులకూ అందని సాయం
రైతుకు… pic.twitter.com/LgI6Daoetz
ఇంకోవైపు రైతుభరోసా మోసమని, కౌలు రైతులకూ అందని సాయమని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం అని వ్యాఖ్యానించారు. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదని, ముఖ్యమంత్రికి సోయి లేదు ప్రభుత్వానికి బాధ్యత లేదని విమర్శించారు. దసరా పండుగ వేళ వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సీఎం రేవంత్‌కు రైతన్నల చేతిలో దండన తప్పదంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.