Harishrao Fires on Cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను మళ్లీ స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. పంద్రాగస్టు వరకు ఆరు గ్యారంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ చేయండని తెలిపారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్‌రెడ్డిని తానే స్వయంగా సిద్దిపేటకు ఆహ్వానించి, శాలువా కప్పుతానని స్పష్టం చేశారు. సీఎం నియమించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి వద్ద ఇద్దరం రాజీనామా లేఖలు ఉంచుదామని పేర్కొన్నారు. సిద్దిపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కు ఇచ్చిన 10 నిమిషాల్లోనే తన లేఖను పంపిస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు వివరించారు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా లేఖ అందజేస్తానని అన్నారు. పంద్రాగస్టు వరకు ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా ఆమోదం చేయించుకుంటానని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, హామీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానన్నారు. ఈ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు.
సీఎంగా రేవంత్ రెడ్డి సిద్దిపేటకు ఏం చేయలేదో చెప్పండని హరీశ్‌రావు అడిగారు. సిద్దిపేటకు రైలు, గోదావరి నీళ్లు, పోలీస్ కమిషనరేట్, మెడికల్, ఫార్మసీ కాలేజ్ లాంటి ఎన్నో విద్యాలయాలను బీఆర్ఎస్ తెచ్చిందని హర్షించారు. సిద్దిపేట అభివృద్ధి కాలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబితే జనాలు నమ్మరని హితవు పలికారు. సిద్దిపేట ప్రజల చైతన్యమే తెలంగాణ పార్టీని పుట్టించిందన్నారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, ఆ ఉద్యమమే లేకుంటే ఈనాడు తెలంగాణ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారు కాదని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికలో ఓట్లు వేయించుకోవడానికి కొత్త నాటకం : ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతే కొడంగల్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తారా అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆనాడు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లా అంటూ ధ్వజమెత్తారు. ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి లేని అప్పులు, అంకెల గారడీ చూపిస్తూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. పెట్టుబడిదారుల్లో అనుమానం రేకెత్తించే విధంగా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయని, దీని వల్ల రాష్ట్రం నష్టపోతుందని ఆవేదన చెందారు.
"సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనాలు నమ్మాలా? అన్నింటికి మించి సిద్దిపేట ప్రజల చైతన్యమే ఈ తెలంగాణను పుట్టించింది. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది సిద్దిపేట పుణ్యమే. ఈరోజు సిద్దిపేటకు, కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి. సీఎం అభివృద్ధి మొత్తం మెదక్ జిల్లాకే పరిమితం అని చెప్పి, ఇప్పుడు లేదని ఎందుకు అంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తానని చెబుతున్నారు. దాన్ని తాను స్వాగతిస్తున్నాను. తాను ఇచ్చిన చాలెంజ్‌ను ఇప్పటివరకు రేవంత్ రెడ్డి స్వీకరించలేదు." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేత