Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. బస్సు యాత్రలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. వరుస రోడు షోలతో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బస్సుయాత్ర షెడ్యూల్లో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాకు కేసీఆర్ బయల్దేరారు. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి వెంట వరంగల్ నుంచి తొర్రూరు దంతాలపల్లి మీదుగా మరిపెడకు చేరుకున్నారు.
జాతీయ పార్టీలు రెండూ బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయ్ : కేసీఆర్ - KCR Election Campaign 2024
మరిపెడకు ముందుగా ఎల్లంపేట స్టేజి తండా వద్ద రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద, కాన్వాయ్ ఆపి కిందకు ఆగారు. అనంతరం అక్కడే ఉన్న ఓ చిన్న హోటల్లోకి వెళ్లారు. దీంతో హోటల్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. అక్కడికి వచ్చిన రైతులు, మహిళలతో కేసీఆర్ మాట్లాడారు. పంటలు ఎలా పండుతున్నాయి, రైతు బంధు అందుతుందా, కరెంట్ సరఫరా ఎలా ఉంది, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయా అని వారిని ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు కలిగిన అదనపు లాభం ఏందని వారిని అడిగి తెలుసుకున్నారు. కొందరు మహిళలు తమ సమస్యలను కేసీఆర్కు విన్నవించారు. వారి బాధలు విన్న కేసీఆర్ వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
హోటల్లో పకోడీలు, మిర్చీలు, కాఫీ రుచి చూసి, అక్కడికి వచ్చిన రైతులకు ఇచ్చారు. కేసీఆర్ వెంట మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అనంతరం మరిపెడకు చేరుకున్న బస్సు యాత్రకు స్థానిక ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కణ్నుంచి ఖమ్మం నగరానికి వెళ్లారు. బస్సులో వెళుతున్న కేసీఆర్ను చూసేందుకు స్థానికులు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రహదారి వెంట నిలుచున్నారు. వారందరికి కేసీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఓటెయ్యాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కేసీఆర్ రాకతో ఖమ్మం పట్టణం గులాబీమయమైంది.