visakha Mlc Election: ఈ నెలాఖరులో ఉత్తరాంధ్ర లో ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నికలు జరుగుతోన్న దృష్ట్యా ఆ ప్రాంతం లోని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పార్టీ వీడకుండా, కాపాడుకునేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తాడేపల్లికి పిలిపించుకుని మరీ వారితో మంతనాలు జరుపుతున్నారు. నిన్న పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశమైన జగన్.. ఇవాళ నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావు పేట నియోజకవర్గాల్లోని స్థానిక పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - వైఎస్సార్సీపీ క్యాంప్ రాజకీయం - Jagan Meeting Paderu YSRCP Leaders
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎవరూ ప్రలోభాలకు లోను కావద్దని, అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చిన జగన్... వారు పార్టీ మారకుండా ఉండేలా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన మెజారిటీ లేకున్నా పోటీ పెట్టి సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో గెలవాలని చూస్తున్నారన్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రెండు నెలలు తిరక్క ముందే ప్రజల్లో తీవ్ర మైన వ్యతిరేకత వచ్చిందన్నారు. చంద్రబాబు పాలనలో స్కూళ్లు నాశనమవుతున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వీర్యమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
తెలుగు దేశం పార్టీ నాయకుల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఇకపై ఉంటుందన్నారు. పోరాడే వారిపై వేధింపులు ఉంటాయన్న జగన్ తాను వేధింపులతో 16 నెలలు జైలుకు వెళ్లానని గుర్తు చేశారు. పోరాటం చేయగలిగినపుడే మనల్ని రెట్టింపు స్థానంలోకి ప్రజలు తీసుకెళ్తారని జగన్ అన్నారు. అధికారం ఉందన్న బలంతో అధ్వాన్నమైన పనులు చేస్తున్నారని అన్నారు. కష్టకాలంలో అండగా ఉన్న వారందరికీ కచ్చితంగా గుర్తింపు ఇస్తానని జగన్ అన్నారు. అందరూ ఐక్యంగా ఉండి వైఎస్సార్సీపీ నిలబెట్టిన బొత్స సత్యానారాయణను గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ సభ్యులను కొనుగోలు చేసి, ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగం చేసి విశాఖపట్నం స్టాండింగ్ కమిటీలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని జగన్ ఆరోపించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 14న స్క్రూటినీ, ఆగస్టు 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితం వెల్లడిస్తారు.
జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే : మంత్రి అనగాని