Former Chairman of Legislative Council Sharif : గుంటూరు జిల్లా మంగళగిరి తహసీల్దారు రామ్‌ప్రసాద్‌ను చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై బదిలీ చేయడాన్ని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తప్పుపట్టారు. రామ్‌ప్రసాద్‌ను ఏపీ టూరిజం అథారిటీలో డిప్యుటేషన్‌పై బదిలీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ అంశాలపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన ఐదు లేఖలు రాశారు. రామ్‌ప్రసాద్ తహసీల్దారుగా 2019 ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు చూశారని, ఆ సమయంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేసి ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు.
మంగళగిరికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రామ్‌ప్రసాద్ వ్యవహారంపై గతంలో అభ్యంతరాలు తెలిపారని గుర్తుచేశారు. సీఆర్డీఏ పరిధిలో అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడంలో రామప్రసాద్ కీలకంగా వ్యవహరించారని షరీఫ్ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో పని చేసేందుకు నియమించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రామ్‌ప్రసాద్ డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
తిరుపతి దొంగ ఓట్ల ఘటన - మరో అధికారిపై వేటు
ఓటర్ల తుది జాబితాలో ఇప్పటికీ అనేక అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయని షరీఫ్ మండిపడ్డారు. చంద్రగిరిలోని కావమ్మగుడి వీధి, తిరుపతి, తిరుపతి అర్బన్ ప్రమీల స్టోర్స్ వీధి, తిరుపతి రూరల్ బాలకృష్ణాపురం, సేరూరు రిక్షా కాలనీ, తిరుపతి ఇస్కాన్ రోడ్డు, చినగొట్టిగాళ్లు ఫాతిమా నగర్, తిరుపతి అర్బన్ సాయికృష్ణా రెసిడెన్సీ కాలనీ, ముత్యాలరెడ్డి పల్లె, తిరుపతి రూరల్ ఆవిలాలోని అనేక బూత్‌లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పుంగనూరు అసెంబ్లీలోని పుంగనూరు మండలం, పుత్తూరు మండలంలో సైతం స్థానికులు కానివారికి ఓట్లు కల్పించారని విమర్శించారు.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ, విజయవాడ తూర్పు నియోజకవర్గాలలోని అనేక బూత్‌లలో చనిపోయిన వారికి, డబుల్ ఓట్లు నమోదు చేశారన్నారు. చిలకలూరిపేట, నరసారావు పేటలలోని అనేక బూత్‌లలో సైతం తప్పులు దొర్లాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వివరించారు. నగరి అసెంబ్లీలోని చౌటూరు గ్రామ బీఎస్ఓ తేజశ్విని 19 మంది స్థానికుల కాని మహిళలకు ఓట్లు కల్పించారని ధ్వజమెత్తారు. దీనిపై చిత్తూరు జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి పిర్యాదు చేశారని, 19 మంది స్థానికేతర మహిళల లిస్ట్‌ను షరిఫ్ లేఖకు జత చేశారు. అనర్హులైన 19 మంది మహిళల ఓట్లు తొలగించేలా చిత్తూరు జిల్లా కలెక్టరుకు, నగరి ఆర్డీవోకుచ పుత్తూరు కమీషనర్‌కు, తహసిల్‌దారుకు ఆదేశాలివ్వాలని కోరారు.
ఒకే ఇంట్లో 32 ఓట్లు - ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న టీడీపీ నేతలు
నంద్యాల పార్లమెంటుకు చెందిన 7 నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరచడానికి పాణ్యంకు దగ్గరలోని శాంతిరాం, ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలను ఎంపిక చేశారని, ఈ రెండు కాలేజీల యాజమాన్యం నంద్యాల జిల్లాకు వైఎస్సార్సీపీ నాయకులే అని పేర్కొన్నారు. శాంతిరామ్ అధికార పార్టీ వైసీపీ తరపున నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ రెండు కాలేజీలను టీడీపీ నాయకుల బృందం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారని, ఈవీఎంలను భద్రపరచాలనే నిర్ణయం వెనక్కు తీసుకుని వేరే చోట్లకు మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేరే చోట్లకు మార్పుచేసే సమయంలో జిల్లాలోని సునిశిత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
'కడప ఓటరు జాబితాలో 20వేలకు పైగా బోగస్ ఓట్లు - ఖాళీ స్థలం పేరిట 42ఓట్లు'