YS Family Tribute to YSR Ghat in Idupulapaya : నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
YS Jagan Tribute to YSR : వీరితో వైఎస్ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ప్రార్థనల అనంతరం తండ్రి సమాధి వద్ద జగన్మోహన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ, జగన్‌ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని ఆయన సముదాయించారు. ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన తర్వాత ఇడుపులపాయలో తల్లి కుమారుడు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా విజయమ్మ కౌగిలించుకొని కంటతడి పెట్టుకున్నారు. అనంతరం జగన్ మూడు రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయల్దేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
YS Sharmila Tribute to YSR : మరోవైపు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోనే ఉన్న జగన్‌తో కలిసి ప్రార్థనలో పాల్గొనలేదు. ఆయన వెళ్లిన అరగంట తర్వాత భర్త అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెతో వైఎస్ ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నివాళులర్పించారు. అయితే జగన్, షర్మిల నిర్వహించిన ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.
YSR Jayanthi Sabha in Vijayawada : మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు విజయవాడకు రానున్నారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో కలిసిన విషయం తెలిసిందే. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఇందులో భాగంగానే ఈ సభకు జాతీయ నేతలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు.