Harish Rao Comments on CM Revanth : సీఎం రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడానికి చంద్రబాబు నాయుడు, మరికొందరు కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలని, అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కమార్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కార్నర్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంతా అబద్ధమేనని, జూటా మాటలు తప్ప చేసిందేమీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలపై బాండ్ పేపర్లు రాసిచ్చి అమలు చేయనందుకు వాళ్లకు శిక్ష పడాలన్నారు. హస్తం ప్రభుత్వం వచ్చాక బంగారం ధర, నిత్యావసర ధరలు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో మంచినీళ్లు రావడం లేదని, పింఛన్ల జాడే లేదని, కేసీఆర్ తెచ్చినవన్నీ తీసేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు కట్టింది, పనులు చేసింది తామేనని, కాంగ్రెస్ అడ్డొచ్చినా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని పేర్కొన్నారు.
కేసీఆర్‌ను గెలిపిస్తేనే ప్రజలందరికీ న్యాయం : రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గౌరవెల్లి ప్రాజెక్టుకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి పూర్తి చేశామని హరీశ్‌రావు తెలిపారు. బండి సంజయ్ గెలిచి ఐదు సంవత్సరాలు అయినా మోదీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తేలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందు దొందేనని, ఆ పార్టీల నేతలు ఇద్దరు రైతులకు వ్యతిరేకులేనని విమర్శించారు. కేసీఆర్‌ను గెలిపిస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లో మోటార్లు కాలుతున్నాయని మండిపడ్డారు.
'కాంగ్రెస్ వాళ్లు లంబాడి వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారా? కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలు చేశారు. లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చి గిరిజనుల గౌరవాన్ని పెంచారు. కాంగ్రెస్ వచ్చాక అన్నీ గోవిందా గోవిందా పాటలా మారాయి. బీఆర్ఎస్ను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వచ్చి హామీలు అమలు చేస్తాం. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నికలు. కాంగ్రెస్, బీజీపీ ఇద్దరు దొందూ దొందే. ఇద్దరు రైతలకు వ్యతిరేకులే. అందువల్ల తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష' -హరీశ్‌రావు, మాజీ మంత్రి
బీఆర్ఎస్పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతోంది : హరీశ్‌రావు - Harish rao Fires on BJP