Ex CM KCR On Telangana Thalli Statue Change : తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖత్వమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు. రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి : ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు రావాలని సూచించారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను వివరించాలని సూచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ అన్నారు. గురుకులాలు, విద్యారంగంలోను అదేవిదంగా మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన సూచించారు.
నిర్భంద పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలు ఎత్తిచూపాలని చెప్పారు. ఫిబ్రవరిలో బహిరంగసభను సర్కార్ వైఖరిని ఎండగడతామన్న ఆయన, ఆ తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రజాసమస్యలపై గళం విప్పుతాం : రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో రారో మీరే చూస్తారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామన్న హరీశ్ రావు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడతామని తెలిపారు. రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడతామన్నారు. ప్రజాసమస్యలపై గళం విప్పుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చింది : కేసీఆర్
మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు - బీఆర్ఎస్ది నిర్మాణం, కాంగ్రెస్‌ది విధ్వంసం : కేటీఆర్