BJP Leader Etela Rajender Wins Malkajgiri MP Seat : దేశంలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరి చూపు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మీదే ఉండే ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న స్థానం. ఇక్కడ 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. వారు ఎటువైపు మొగ్గుచూపితే ఆ గెలుపొందిన అభ్యర్థి అత్యధిక మెజారిటీని సాధిస్తారు. అయితే ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి ఆ తర్వాత కాలంలో రాజకీయంగా ఉన్నత పదవులు సాధించడం ఆనవాయితీగా వస్తుంది. 2009లో పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతమంది అభ్యర్థులు గెలిచారో? వారు ఏ స్థానాల్లో ఉన్నారో? తెలుసుకుందాం.
మొట్టమొదటిసారి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఎదిగారు. 2012-14 వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
మంత్రిగా మల్లారెడ్డి : 2014లో తెలుగుదేశం తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలుపొంది. పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేడ్చల్ అసెంబ్లీ నుంచి గెలిచి మంత్రి పదవిని పొందారు.
సీఎంగా రేవంత్ రెడ్డి : 2014 తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 2018లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పరాజయం పాలైన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయనను మల్కాజిగిరి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే 2019లో లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అత్యధిక ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు పదవి పొంది 2023 శాసనసభ ఎన్నికలో ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
మరి రాజేందర్ పరిస్థితి ఏంటి ? : ఇది మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ఉన్న సత్తా. అయితే ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేశారు. భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు 2023లో జరిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మళ్లీ మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు. మరి పాత ఆనవాయితీ ప్రకారం ఈటల రాజేందర్ కూడా ఉన్నత పదవులను అధిరోహిస్తారని కొందరు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈసారి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఎవరు ఉంటారు? ఈటల రాజేందర్‌కి కేంద్రమంత్రి పదవి వస్తుందా అనేది రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది: ఈటల రాజేందర్ - Etela Rajender on Lok Sabha Polls