Malkajgiri Lok Sabha Election Results 2024 : తెలంగాణలో లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రకియ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరిలో పాగా వేసేందుకు అన్ని ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్ ముగిసేసరికి 2 లక్షలకు పైగా ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
Lok Sabha Election Results 2024 in Telangana : తెలంగాణలో మినీ ఇండియాగా భావించే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో పోరు హోరా హోరీగా సాగింది. 38 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని వ్యూహాలను రచించింది. ఈసారి తెలంగాణలో అధికారంలో ఉండటం గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయ సాధించిన నియోజకవర్గం కావడంతో హస్తం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం కూడా నిర్వహించారు.
ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం మల్కాజిగిరిపై గులాబీ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ, మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. మల్కాజిగిరిని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పార్టీల్లో బీజేపీ సైతం అగ్రస్థానానే నిలిచింది. అందుకే ఆ పార్టీలో ప్రధాన నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను మల్కాజిగిరి నుంచి పోటీలో నిలిపింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందాలనే కసితో ప్రచారం చేశారు. రాజకీయ అనుభవం, పలుకుబడి సైతం ఈటల రాజేందర్‌కు కలిసివచ్చే అంశంగా మారిందని తెలుస్తోంది.