Election Campaign In Telangana : రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కైవసమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న అధికార కాంగ్రెస్ అటు ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా చిలుకూరు బాలాజీ స్వామిని సతీసమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణపేటలో స్థానిక ఎమ్మెల్యే పర్నికరెడ్డితో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి, బీజేపీలో చేరిన డీకే అరుణకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేంటని వంశీ ప్రశ్నించారు.
Congress Lok Sabha Elections Campaign 2024 : కాంగ్రెస్ మ్యానిఫెస్టో పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఖండించారు. భారాత రాజ్యాంగం పట్ల బీజేపీకి ఏ మాత్రం గౌరవం ఉందో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. సామాజిక సమీకరణల కారణంగానే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో జాప్యం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని వెంకటేశ్వరాలయంలో పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి ఎంపిక ఆలస్యం కావడానికి కారణాలను వివరించారు. స్థానిక ఎంపీ బండి సంజయ్ ఏనాడూ ప్రజాసమస్యలను పట్టించుకోలేదని ఎన్నికల వేళ రాజకీయాలు మొదలుపెట్టారని విమర్శించారు.
BJP Elections Campaign 2024 : గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు మించి విజయాన్ని సాధించేందుకు కమలదళం వ్యూహాలు పన్నుతోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన పలువురు యువకులు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాషాయకండువా కప్పుకున్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇప్పుడిప్పుడే యువతీ యువకులకు అవగాహన ఏర్పడుతోందని కొండా తెలిపారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ రాబోతుందని గాంధీ భవన్‌లో పంచాంగ శ్రవణం చేసిన పండితుడే చెప్పాడని బీజేపీ నాయకురాలు రాణిరుద్రమ తెలిపారు.
కొడంగల్ అభివృద్ధి చేశానని చెబుతున్న రేవంత్‌రెడ్డి ఒక్క నియోజకవర్గానికి మాత్రమే సీఎం కాదని చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ నగర కార్యాలయంలో ఎన్నికల ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. బీజేపీ ఒంటరిగా పోటీచేస్తుందని ఎవరిపై కుట్రలు చేయాల్సిన అవసరం తమకు లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉగాది వేళ ఖమ్మం స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న నామా ప్రత్యేక పూజలు నిర్వహించారు.