Congress party electoral alliance with communists : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి వెళ్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావుతో షర్మిల భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కలిసి వచ్చేందుకు అంగీకరించిన సీపీఎం, సీపీఐ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామని తెలిపారు. కలిసికట్టుగా లేకపోతే రాబోయే ఎన్నికల్లో పర్వతాలను ఢీకొట్టడం కష్టమన్నారు. పొత్తులపై త్వరలో అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తామన్నారు.
సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజలను బిచ్చగాళ్లుగా తయారు చేశారన్నారని విమర్శించారు. బీజేపీతో కలిసి వచ్చే కూటమి, అధికార పార్టీ వైసీపీతో తమ పోరాటం కొనసాగుతుందన్నారు. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అన్ని విషయాలపై స్పష్టంత ఇస్తామన్నారు.
రాష్ట్ర విభజన హామీలపై బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. పదేళ్ల గడువు పెంచి ప్రత్యేక హోదా ఇస్తామని విస్మరించింది. మోదీ ఏపీలో పర్యటించి పుణ్యక్షేత్రంలో చేసిన వాగ్దానానికి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యింది. ప్రత్యేక హోదా కోసమే పొత్తు పెట్టుకుంటున్నామని చంద్రబాబు కూడా మోసం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయకపోగా, ఉద్యమ కారులపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం పట్టించుకోలేదు. ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. - వైఎస్ షర్మిల అధ్యక్షురాలు
సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగాయి. రెండు విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ, బీజేపీకి కొమ్ము కాస్తూ రాష్ట్రానికి ద్రోహం చేసిన వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాం. జనసేన-టీడీపీ కూటమి కూడా రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. బీజేపీని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఆ పార్టీకి ఇక్కడ ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. - శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం
భారత దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ పెద్ద ఎత్తున బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని పక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. లేదంటే రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉంది. - రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి సీపీఐ