EC Suspends Chandramouleshwar Reddy: తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమ ఓట్ల నమోదుపై ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై వేటు వేసిన ఎన్నికల సంఘం మరో అధికారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఓ వర్గం గెలుపు కోసం పాటు పడ్డారంటూ ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన ఈసీ అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. తాజాగా ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రమౌళీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై వేటు: తిరుపతిలో దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆర్‌వో లాగిన్‌తో 35 వేల ఓటరు కార్డులు డౌన్‌లోడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెడ్ చేసింది.
తాజాగా దొంగ ఓట్ల నమోదు ఘటనలో చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సైతం సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అసలు చంద్రమౌళీశ్వర్‌రెడ్డికి ఈఆర్‌వో బాధ్యతలను ఈసీ అప్పగించలేదని జీవోలో ఈసీ వెల్లడించింది. ఎపిక్ కార్డుల అక్రమ డౌన్‌లోడ్‌పై ఆయన పాత్ర తేల్చాల్సి ఉందని జీవోలో తెలిపింది. చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తన పరిధి దాటి ఈఆర్‌వో విధులు నిర్వర్తించారని ఈసీ పేర్కొంది. ఘటనపై పోలీసులు పూర్తి విచారణ జరపాల్సి ఉందని జీవోలో ఈడీ పేర్కొంది. ఈసీ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికార కొందరు అధికారులు వైఎస్సార్సీపీకి తొత్తులుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించాయి.
వేషాలు వేస్తే వేటే- రెండేళ్లనంతరం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర
ఇప్పటికే కలెక్టర్ సస్పెండ్: తిరుపతి జిల్లాలో ఓటరు జాబితాలో అవకతవకలు, దొంగ ఓట్ల చేర్పులు, ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ, ప్రతిపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో ఆర్వోగా గిరీషా వ్యవహరించారు. ఎపిక్ కార్డుల డౌన్‌లోడ్ వ్యవహరంలో, గిరీషా లాగిన్ దుర్వినియోగం చేశారని అభియోగం నమోదైంది. ఎన్నికల విధుల్లో నిష్పక్షతపాతంగా వ్యవహరించాలనే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించలేదని అభియోగం గిరీషాపై ఉంది. గిరీషా లాగిన్ ద్వారా దొంగ ఓట్లు సృష్టించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.